వారిద్దరూ మాజీ ఎమ్మెల్యేలు. గత ఎన్నికల్లో పార్టీ అధినేత నిర్ణయానికి తలొగ్గారు. తమకు పోటీ చేసే అవకాశం దక్కలేదన్న బాధ, ఆవేదన ఉన్నా.. మౌనంగా పంటిబిగువున భరించారు. అంతేకాదు.. అప్పటి వరకు నియోజకవర్గంలో దూకుడుగా వ్యవహరించినా.. చివరినిముషంలో టికెట్ దక్కడం లేదని తెలిసినా కుంగిపోలేదు. వారే.. మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. ఇద్దరూ గత ఎన్నికల్లో టికెట్లు కోల్పోయిన వారే. అయితే.. పార్టీ పట్ల వారు చూపిన విధేతయ, పార్టీకి చేసిన సేవలను చంద్రబాబు గుర్తించారు.
వారుకోరకుండానే తాజాగా జరిగిన నామినేటెడ్ పదవుల పంపకంలో వారికి ప్రాధాన్యం ఇచ్చారు. గత ఎన్నికల్లో తిరువూరు నుంచి పోటీ చేయాలని భావించిన కేఎస్ జవహర్‌కు చివరి నిముషంలో చంద్రబాబు పిలిచి బుజ్జగించారు. ఈ క్రమంలోనే గుంటూరుకు చెందిన కొలికపూడి శ్రీనివాసరావును తీసుకువచ్చి టికెట్ ఇచ్చారు. ఆయన గెలుపు కోసం కూడా జవహర్ పనిచేశారు. అప్పటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాలకు ఆయన పరిమితం అయ్యారు. వివాదాలకు దూరంగా ఉంటూ.. పార్టీ గీసిన గీతకు లోబడి కార్యక్రమాలకు హాజరవుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు..జవహర్‌కు కీలకమైన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని అప్పగించారు. ఇది నామినేటెడ్ పదవే అయినప్పటికీ.. కేబినెట్ హోదా ఉంటుంది. మంత్రికి ఉండే సర్వ అధికారాలు కూడా ఉంటాయి. దీంతో జవహర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా గత ఎన్నికల్లో టికెట్ ఆశించారు. నియోజకవర్గంలో జోరుగా పర్యటించారు. కానీ, చివరి నిముషంలో ఏకంగా ఈ స్తానాన్ని పార్టీ వదులకుని జనసేనకు కేటాయించింది. దీంతో ఆరణి శ్రీనివాసులు విజయం దక్కించుకున్నారు.
అయినా.. సుగుణమ్మ కుంగిపోకుండా పార్టీ కోసం పనిచేశారు. తిరుపతిలో పార్టీ పటిష్టానికి ఆమె కృషి చేస్తున్నారు. అదే సమయంలో తరచుగా మీడియా ముందుకు కూడా వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ.. సాధారణ మహిళగానే ఆమె వ్యవహరిస్తారన్న పేరుకూడా ఉంది. ఈ విధేయత, పార్టీ పట్ల అంకిత భావం గుర్తించిన చంద్రబాబు తాజా నామినేటెడ్ పదవుల్లో సుగుణమ్మకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆమె కోరకుండానే.. ఏపీ గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమించారు. దాదాపు ఇది కూడా కేబినెట్ హోదాకు అటు ఇటుగా సమానమని అధికారులు చెబుతున్నారు.