ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తరఫున గట్టి వాయిస్ వినిపించడమే కాకుండా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయవాడకు చెందిన బీసీ నాయకురాలు పంచుమర్తి అనురాధ. 1990 ల నుంచి కూడా ఆమె టీడీపీలోనే ఉన్నారు. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన అనురాధ.. విజయవాడ కార్పొరేషన్ మేయర్‌గా కూడా పనిచేశారు. అయితే.. ఆ తర్వాత చాలా కాలం పాటు పార్టీకి దూరంగా ఉన్నారు. మళ్లీ రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల సమయంలో రాజకీయ తెరమీదికి వచ్చారు పంచుమర్తి.
బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడం.. మంచి వాయిస్ కూడా ఉండడంతో బాగానే పుంజుకున్నారు. అప్పట్లోనే ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. 2019లో ఎమ్మల్యే టికెట్ కోసం 2017 నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న గుంటూరు జిల్లా మంగళగిరిపై పంచుమర్తి ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఈ విషయం తెలిసి.. ఆమెకు గుర్తింపు ఇవ్వాలని భావించిన చంద్రబాబు.. ఆమెకు ఎమ్మెల్సీ సీటును ఆఫర్ చేశారు. అయితే, తనకు ఎమ్మెల్యే టికెట్టే కావాలని పట్టుబట్టారు పంచుమర్తి.
కానీ, ఆమె ఆశలు ఆవిరయ్యారు. ఏకంగా చంద్రబాబు కుమారుడు లోకేష్.. మంగళగిరి నుంచి పోటీ చేశా రు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన పంచుమర్తి… ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉన్నారు. మళ్లీ చంద్ర బాబు రాయబారంతో ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో నే అధికార వైసీపీపై విమర్శలు చేశారు. ఇలా సాగుతున్న క్రమంలో ఇటీవల టీడీపీలో పార్టీ పదవులు ఇచ్చారు. పార్టీ పార్లమెంటరీ పదవులు ఇచ్చారు వాటిలో పంచుమర్తికి అవకాశం ఇవ్వలేదు.
బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తానన్న చంద్రబాబు .. తనకు ఎక్కడా ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఆమె ఒకింగ హర్ట్ అయ్యారు. దీంతో మళ్లీ.. తెరచాటుకువెళ్లిపోయారు. అంటే.. పార్టీలో 1990లలో దక్కిన మేయర్ పదవి తప్ప.. ఇప్పటి వరకు పంచుమర్తికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. ఇప్పుడు కూడా ఆమెకు ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదని ఆమె కుటుంబం కూడా ఆరోపిస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో.. తాజాగా చంద్రబాబు ఆమెకు మంగళగిరి అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని.. ఆదిశగా ఆయన పావులు కదుపుతున్నారని సంకేతాలు వస్తున్నాయి. అయితే.. దీనికి మూడేళ్ల సమయం ఉండడం. అప్పటికి రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయోనని విశ్లేషణలు వస్తుండడంతో పంచుమర్తి.. ఇంకా అసంతృప్తితోనే ఉండడం గమనార్హం.