వైసీపీ నాయకుడు, గత వైసీపీ సర్కారులో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ యువ నాయకుడు, విజయవాడ వైసీపీ తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్‌గా ఉన్న దేవినేని అవినా ష్ చౌదరిలను తాజాగా ఏపీ సీఐడీ పోలీసులు విచారించారు. 2021-22 మధ్య కాలంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫర్నిచర్ సహా.. అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి.
పలువురు కార్యకర్తలు కూడా గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా.. ఒక పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిందంటూ.. దేశవ్యాప్తంగా కూడా చర్చకు వచ్చింది. అలాంటి కేసు.. వైసీపీ హయాంలో నిర్వీర్యం అయ్యేలాకొందరు వ్యవహరించారు. కానీ, కూటమి వచ్చిన తర్వాత.. ఈ కేసును తిరగదోడడంతోపాటు.. పలువురిపై కేసులు నమోదు చేసింది. నాటి దాడి ఘటనకు సంబంధించి 26మంది వైసీపీ కార్యకర్తలు ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
ఇంత తీవ్రత ఉన్న కేసుపై తాజాగా జరిగిన విచారణలో సజ్జల రామకృష్ణారెడ్డి అసలు తనకు ఈ దాడి గురించి తెలియనే తెలియదని చెప్పుకొచ్చారు. అసలు అప్పట్లోతాను ఉప ఎన్నికల నేపథ్యంలో తీరిక లేకుండా ఉన్నానని.. ఫోన్లు కూడా పక్కన పెట్టానని సీఐడీ అధికారులకు చెప్పుకొచ్చారు. తెల్లవారి పేపర్ల చూసిన తర్వాతే.. ఏదో కార్యాలయంపై దాడి జరిగిందని తెలిసిందని.. అప్పట్లోనే తాను దీనిని ఖండించానని వివరించారు. దీంతో సీఐడీ అధికారులు వివరాలు నమోదు చేసుకుని సజ్జలను బయటకు పంపించారు.
ఇక, దేవినేని అవినాష్ కూడా.. తాను అప్పట్లో ఊళ్లోనే లేనని.. సొంత పనులపై బెంగళూరుకు వెళ్లానని చెప్పారు. కానీ.. దాడి జరిగిన సమయంలో పక్కనే రోడ్డుపై ఒక కారులో దేవినేని అవినాష్ కూర్చుని ఉన్న ఫొటోలను అధికారులు ఆయనకు చూపించగా.. అవి నకిలీవని కొట్టిపారేశారు. ఇదిలావుంటే.. విచారణ నిమిత్తం సీఐడీ ఆఫీసుకువచ్చిన సజ్జలకు మాజీ మంత్రి విడదల రజనీస్వాగతం పలకడం.. బొకే ఆయన చేతికి అందించే ప్రయత్నం చేయడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates