‘జడ్ ప్లస్’లో జగన్ కు నిరాశ!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధ రించాలని దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు శుక్రవారం లైట్ తీసుకుందని చెప్పక తప్పదు. సీఎంగా ఉండగా… తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కొనసాగిందని, అయితే విపక్షంలోకి మారిన తర్వాత తనకు ఏమాత్రం ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కేంద్రం తన భద్రత స్థాయిని తగ్గించిందని జగన్ తన పిటిషన్ లో ఆరోపించారు. తనకు ముప్పు పొంచి ఉందన్న జగన్… తక్షణమే తనకు ఇదివరకటి మాదిరిగానే జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించాలని కోర్టును కోరారు.

గురువారం దాఖలైన ఈ పిటిషన్ పై శుక్రవారమే హైకోర్టు విచారణ చేపట్టింది. అంతేకాకుండా పిటిషన్ దాఖలైన మరునాడే జరిగిన ఈ విఛారణలోనూ కోర్టు ఇటు జగన్ వాదనతో పాటుగా అటు కేంద్ర ప్రభుత్వ వాదనను కూడా సావదానంగా విన్నది. ఈ క్రమంలో కోర్టు ఈ విషయాన్ని ఈ రోజే తేల్చేస్తుందని వైసీపీ శ్రేణులు భావించాయి. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఈ పిటిషన్ పై తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత చేపట్టనున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. అంటే… వేసవి సెలవులు ముగిసిన తర్వాత అంటే… హీనపక్షం నెల సమయమైనా పడుతుంది కదా.

క్షణాల్లో కోర్టు నుంచి తీర్పు వస్తుందనుకుంటే… ఇలా జరిగిందేమిటీ? అంటూ జగన్ తో పాటుగా వైసీపీ నేతలు కూడా షాక్ కు గురయ్యారని చెప్పక తప్పదు. సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత జగన్ పెద్దగా బయటకే రావడం లేదు. ఏదో కొన్ని తప్పనిసరి కార్యక్రమాలు ఎంపికచేసుకుని వాటికి మాత్రమే ఆయన హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాల్లోనూ ఆయన పోలీసులు జారీ చేస్తున్న ఆదేశాలను పెద్దగా పట్టించుకోవడం లేదన్న వాదనలు లేకపోలేదు. అంతేకాకుండా ఎక్కడికి వెళ్లినా…పోలీసు అదికారులు వైసీపీ శ్రేణులను వేధిస్తున్నాయని ఆరోపిస్తూ తాము అదికారంలోకి వచ్చాక బట్టలూడదీసి కొడతామంటూ సంచలన వ్యాఖ్యలూ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే… సీఎంగా ఉండగా తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కేంద్రం కల్పించిందని పిటిషన్ కోర్టుకు జగన్ గుర్తు చేశారు. అయితే విపక్ష నేతగా మారిన వెంటనే తనకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తన భద్రతను కుదించారని ఆరోపించారు. ఫలితంగా తన భద్రతకు ముప్పు ఏర్పడిందని తెలిపారు. ఈ క్రమంలో తక్షణమే తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. ఇప్పటికే తాను కేంద్రానికి లేఖ రాస్తే అటు నుంచి స్పందన రాలేదని, అందుకే కోర్టుకు రావాల్సి వచ్చిందని తెలిపారు. కేంద్రం నుంచి స్పందన రాకపోతే.. సొంతంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం వినియోగిచుకునేందుకు అనుమతించాలని ఆయన కోరారు. మరి వేసవి తర్వాత కోర్టు ఏం చెబుతుందో చూడాలి.