విజయవాడకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ జనసేన నేత.. ప్రస్తుతం వైసీపీలో ఉన్న పోతిన వెంకట మహేష్‌కు తొలి అడుగులోనే సెగ పుట్టింది. గత ఎన్నికల సమయంలో విజయవాడ వెస్ట్ నియోజక వర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేయాలని భావించిన పోతినకు .. పార్టీ అధిష్టానం శ్రీముఖం చూపించింది. దీంతో నాలుగు మాటలు అనేసి.. ఆ వెంటనే వైసీపీలోకి జంప్ అయ్యారు. అప్పటి ఉంచి ఖాళీగా ఉన్న పోతినకు ఇటీవల వైసీపీ అధినేత కీలక బాధ్యతలు అప్పగించారు.
గుంటూరు పార్లమెంటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌గా పోతినకు జగన్ చాన్స్ ఇచ్చారు. దీంతో సహజంగానే ఉత్సాహంగా ఉండే.. పోతిన ఈ అవకాశం రావడంతో ఎగిరి గంతేశారు. ఆ వెంటనే జగన్‌కు కూడా ఆయన అభినందనలు తెలిపారు. కీలక బాధ్యతలు అప్పగించారని.. పార్టీని పరుగులు పెట్టిస్తానని కూడా చెప్పారు. జగన్ అలా జాబితా విడుదల చేయగానే.. పార్టీ కార్యాలయంలో ఇలా సమావేశం ఏర్పాటు చేసి.. తనపై నమ్మకం ఉంచిన జగన్‌కు కృతజ్ఞతలు కూడా తెలిపారు.
కట్ చేస్తే.. తాజాగా పోతిన మహేష్.. గుంటూరులో వైసీపీ రాజకీయాలను చక్కదిద్దేందుకు రెడీ అయ్యారు. పార్టీని బలంగా విస్తరించేందుకు.. నాయకులను బుజ్జగించి లైన్‌లో పెట్టేందుకు ఆయన ప్రయత్నాలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన కొందరు నాయకులకు ఫోన్లు చేశారు. పార్టీ పరిస్థితిని తెలుసుకుని.. దానికి తగిన విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. అయితే.. పోతిన చేసిన ఫోన్లకు ఒకరిద్దరు తప్ప.. ఎవరూ స్పందించలేదని సమాచారం.
పైగా.. సీనియర్లుగా ఉన్నవారు.. ఎవరూ పోతిన ఫోన్లను లిఫ్ట్ చేయలేదని తెలిసింది. దీంతో ఆయన హర్ట్ అయినా.. వెంటనే తనను తాను సమర్థించుకుని.. స్వయంగా గుంటూరుకు వెళ్లేందుకు ముహూర్తం పెట్టు కున్నారు. అప్పుడు అందరనీ కలిసి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయనున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ.. మరోవైపు.. సీనియర్లుగా ఉన్న నాయకులు.. ఎక్కడో పార్టీ నుంచి వచ్చిన జూనియర్‌కు.. ఇక్కడ బాధ్యతలు అప్పగించడం ఏంటన్న చర్చ పెట్టారు. ఈ కారణంగానే.. నాయకులు ఫోన్లు ఎత్తలేదని తెలిసింది. మరి ఈ వివాదాన్ని పోతిన ఎలా సర్దుబాటు చేసుకుని ముందుకు సాగుతారో చూడాలి.