నిన్నటి వరకు భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించుకోవాలని.. రెండు దేశాలు తమకు అత్యంత ముఖ్యమైన దేశాలని.. మిత్రదేశాలుగా సమ ప్రాధాన్యం ఇచ్చిన అగ్రరాజ్యం అమెరికా.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో కాస్త మారింది. నిజానికి ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి భారత్ నిర్ణయం.. దాయాది పాక్ తీరుకు తగిన రీతిలో బుద్ది చెప్పటానికే అన్న విషయం తెలిసిందే. అయినప్పటికి.. పాక్ ను కాస్తంత వెనకేసుకు వచ్చింది అగ్రరాజ్యం. గురువారం రాత్రి చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అమెరికా తీరులో మార్పు వచ్చింది.
గురువారం రాత్రి అనూహ్య రీతిలో భారత్ మీదకు దాడులకు ప్రయత్నించి విఫలమైన పాకిస్థాన్ తీరుపై అమెరికా అగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతకంతకూ పెంచుకుపోతున్న ఉద్రిక్తతల వేళ.. పాకిస్థాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఫోన్ చేశారు. తాజా పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు.. పాక్ వ్యవహారశైలిని తీవ్రంగా తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. పాక్ ప్రధానిని మందలించినట్లుగా చెబుతున్నారు.
తాజా పరిణామాలు పాకిస్తాన్ కు భారీ ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు. పాక్ ప్రధానికి ఫోన్ చేసి మరీ అమెరికా విదేశాంగ మంత్రి ఇంతలా సీరియస్ కావటం చూస్తుంటే.. దాయాది తీరుపై అగ్రరాజ్యం ఏ మాత్రం సంతోషంగా లేదని చెప్పక తప్పదు. దౌత్యపరంగా పాకిస్తాన్ కు ఇదో భారీ దెబ్బగా అభివర్ణిస్తున్నారు. ఆసియాలో మరో యుద్ధ పరిస్థితి తలెత్తాలని తాము అనుకోవటం లేదని.. ఉగ్రవాద అంశంపై తాము ఎలాంటి దయ చూపలేమని స్పష్టం చేయటం ద్వారా.. పాక్ తీరుకు తాము మద్దతు ఇవ్వమన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెప్పాలి. అంతేకాదు.. ఉగ్రవాద అంశంతో తాము ఎలాంటి దయ చూపలేమని స్పష్టం చేయటం గమనార్హం.
మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి భారత్ కు ఫోన్ చేయటం.. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తో మాట్లాడటం తెలిసిందే. భారత ఆత్మరక్షణ హక్కను సమర్థిస్తూ.. ఉగ్రవాదంపై చేసే పోరులో భారత్ తో అమెరికా అండగా నిలుస్తుందని.. ఉగ్రవాంపై భారత్ తీసుకునే సైనిక చర్యను వాషింగ్టన్ సమర్థించుకుంటుందని స్పష్టం చేయటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. గత వారం నుంచి పాక్ వ్యవహరిస్తున్న తీరుపై మొదట్లో స్పందించిన అమెరికా తీరుకు.. గురువారం రాత్రి తర్వాత జరిగిన పరిణామాల తర్వాత దాయాది దేశంపై అమెరికా తీరులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి.