-->

అమరావతి మూలపాడు దశ తిరుగుతుంది

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నవ నగరాలతో నిర్మితం కానున్న సంగతి తెలిసిందే. వీటిలో అత్యధిక ప్రాధాన్యం కలిగిన క్రీడా నగరం (స్పోర్ట్స్ సిటీ) కోసం కూటమి సర్కారు ప్రాథమిక ప్రతిపాదనలు రూపొందించడం, వాటిలో కొన్ని లోటుపాట్లు ఉండగా… వాటిని సరిదిద్దడం, ఆ సరిదిద్దిన ప్రతిపాదనల మేరకు నాలుగు గ్రామాల రైతులు తమ భూములను స్సోర్ట్స్ సిటీ కోసం ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం… ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి.

ఈ మేరకు రాజధాని నిర్మాణం కోసం ఇదివరకే సేకరించిన 29 గ్రామాల్లోని 34 వేల ఎకరాలు కాకుండా… అదనంగా మరో 4 గ్రామాలను ఎంపిక చేసి… వాటిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు అయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. కూటమి ప్రభుత్వం ఇలా ప్రతిపాదించగానే…తమ గ్రామాల పరిధిలో రాజదాని నగరం అయిన స్పోర్ట్స్ సిటీ వస్తోందంటే… అంతకంటే ఏం కావాలన్న భావనతో ఆ 4 గ్రామాల రైతులు తమ భూములను భూసమీకరణ పద్ధతిలోనే ఇచ్చేందుకు గ్రామసభల్లో ఆమోదం తెలిపారు.

ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనాపురం, మూలపాడు, కోటికలపూడి, జమీమాచవరం గ్రామాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కానుంది. గతంలో కృష్ణా నదీ తీరానికి అత్యంత సమీపాన ఉన్న చినలంక, పెదలంక గ్రామాలను స్పోర్ట్స్ సిటీ కోసం పరిశీలించగా.. వరద ముంపు ప్రమాదం పొంచి ఉండటంతో ప్రభుత్వం వీటిని వద్దనుకుంది. ఆ వెంటనే ఇప్పటికే రెండు క్రికెట్ స్టేడియాలు ఉన్న మూలపాడు పరిపర గ్రామాలపై దృష్టి సారించి ఎట్టకేలకు స్పోర్ట్స్ సిటీ ప్రతిపాదనలను పూర్తి చేసింది.

హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిని కలుపుతూ మూలపాడు వద్దే కృష్ణా నది మీద అమరావతికి ఐకానిక్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే మూలపాడు కేంద్రంగా స్పోర్ట్స్ సిటీ నిర్మాణం అమరావతికి మరింత శోభను తీుకొస్తుందన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అమరావతి ఎంట్రీలోనే స్పోర్ట్స్ సిటీ జనానికి స్వాగతం పలికితే ఆ ఆహ్వానమే అదిరిపోతుందన్న విశ్లేషణలు సాగుతున్నాయి