వైసీపీ నాయకులపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు పడ్డాయి. జైలు-బెయిలు అంటూ.. నాయకులు, అప్పట్లో వైసీపీకి అనుకూలంగా పనిచేశారని చెప్పుకొనే ఐపీఎస్ అధికారులు కూడా కేసులు ఎదుర్కొంటున్నారు. పీఎస్ ఆర్ ఆంజనేయులు ఏకంగా జైలు జీవితం గడుపుతున్నారు. ఇంకా మరికొందరి చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. వారి ప్రొఫైల్‌తో సంబంధం లేకుండా. వైసీపీ హయాంలో చేసిన పనులే శాపంగా పరిణమించాయి.
ఇక, నాయకుల పరిస్థితి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వారు కూడా బెయిల్ దక్కక చిక్కులు పడుతున్నారు. అయితే.. ఈ విషయాలన్నీ.. తాజాగా జగన్ నిర్వహించిన పార్టీ సమావేశంలో చర్చకు వచ్చాయి. జగనే ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయం అప్పుడే చెప్పా అంటూ.. జగన్ చెప్పుకొచ్చారు. పార్టీ మళ్లీ అధికారంలోకి రాకపోవడంతోనే ఇలా జరిగిందని.. కేసులు పెడతారని తాను ఇదివరకే చెప్పానని జగన్ ముక్తాయించారు.
మనం అన్నీ మంచిగానే చేశాం. అయినా.. మనపై రాజకీయం జరుగుతోంది. ఈ విషయాన్ని ఎన్నికలకు ముందే నేను చెప్పా. పార్టీ గెలుపుకోసం కష్టపడి పనిచేయాలని చెప్పా. కానీ.. జరిగిపోయింది. ఇప్పటికైనా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పనిచేయాలి. మనమే అధికారంలోకి వస్తాం.. అని నేను చెబుతున్నా.. మీరు కూడా ఆదిశగా అడుగులు వేయాలి. వచ్చే ఎన్నికల్లో అయినా.. మనం అధికారంలోకి వచ్చి తీరాలి. అప్పటి వరకు కేసులు తప్పవు. అని జగన్ చెప్పుకొచ్చారు.
అయితే.. అధికారంలోకి వచ్చినా.. రాకున్నా.. కొన్ని కేసులు మాత్రం జగన్‌ను వెంటాడుతున్నాయి. కానీ.. పార్టీ నాయకులకు కొంత ఊరట లభించి ఉండేది. వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే.. ఆయన చెప్పినట్టు ఇబ్బందులు ఉండేవి కాకపోయినా.. అధికారంలోకి వచ్చే పరిస్థితిని మాత్రం నాయకులు చేజేతులా పాడుచేసుకున్నారన్నది వాస్తవం. ప్రజలకు చేరువ కాకపోవడం.. వారిపైనే దూషణలకు దిగడం(జీడీ నెల్లూరులో ఇదే జరిగింది) వంటివి వైసీపీని ప్రజలకు దూరం చేశాయి. ఈ విషయాన్ని గుర్తించి.. ఉంటే ఇప్పటికైనా వైసీపీకి మంచిరోజులు వస్తాయని పరిశీలకులు చెబుతున్నారు.