2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగానే సమయం ఉంది. ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే తప్పించి… ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు ఏపీకి ముఖ్యమంత్రి కాలేరు. నాలుగేళ్ల సమయం ఉందని రాజకీయ నేతలు అలా ఖాళీగా కూర్చోలేరు కదా. అందుకే కాబోలు…2029 ఎన్నికల్లో విజయం దక్కించుకునే దిశగా ఇప్పుడే వ్యూహాలు రచించుకుంటున్న జగన్ బుధవారం ఓ కీలక ప్రకటన చేశారు. 2029 ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా 2027లో తాను మరోమారు పాదయాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు.
ఈ మేరకు బుధవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్లమెంటు ఇంచార్జీలతో జరిగిన సమావేశంలో జగన్ తన పాదయాత్రపై ప్రకటన చేశారు. ఇదివరకే జగన్ 2.0 పాదయాత్రపై మొన్నామధ్య పార్టీ కీలక నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. గుడివాడ ప్రకటన నిజమేనన్నట్లుగా తన పాదయాత్రపై జగన్ బుధవారం కీలక ప్రకటన చేశారు. 2019 ఎన్నికలకు ముందు తాను నిర్వహించిన పాదయాత్ర తరహాలోనే 2029 ఎన్నికలకు ముందుగా 2027లో పాదయాత్ర చేస్తానని జగన్ చెప్పుకొచ్చారు.
మరోమారు పాదయాత్రతో తాను మరోమారు సీఎం అవ్వడం ఖాయమేనన్న రీతిలో జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్న జగన్…అదే విషయాన్ని తాను చేపట్టిన పాదయాత్రలో జనం వద్ద ప్రస్తావించానని గుర్తు చేశారు. తన పాదయాత్ర తో చంద్రబాబు మోసాన్ని జనం గుర్తించి వైసీపీపి గెలిపించారని ఆయన తెలిపారు. ఇప్పుడు కూడా 2014 పరిస్థితులే ఉన్నాయన్న జగన్… 2027లో చేపట్టే పాదయాత్రతో జనం వైసీపీకి విజయం కట్టబెడతారని ధీమా వ్యక్తం చేశారు.
ఇక 2027లో చేపట్టే పాదయాత్రకు సంబంధించిన విస్పష్ట ప్రకటన, పార్టీ రాజకీయ వ్యూహాల ప్రకటనలను వచ్చే ఏడాది నిర్వహించే పార్టీ ప్లీనరీలో చేస్తానని జగన్ చెప్పారు. ప్లీనరీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఇక 2029 ఎన్నికల్లో పార్లమెంటు ఇంచార్జీలు తమ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నింటిని గెలిపించుకుని వస్తారన్న దాని ఆధారంగా వారికి ప్రాధాన్యం ఇస్తానన్నారు. ప్రాంతీయ సమన్వయకర్తలకూ ఇదే వర్తిస్తుందన్నారు. ఈ దఫా కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే దిశగా తమ పాలన ఉంటుందని, ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులకు చేరవేయాలని ఆయన నేతలకు సూచించారు.