వైసీపీలో ఒకే ఒక్క ‘కుర్రోడు’ ..!

వైసీపీలో నాయ‌కులు బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఎన్నిక‌లు పూర్త‌యి ఏడాది అయినా పెద్ద‌గా ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. నోరు విప్ప‌డం లేదు. కీల‌క నాయ‌కులు కేసుల్లో చిక్కుకోగా.. కేసులు లేని నాయ‌కులు.. విమ‌ర్శ‌లు చేసేందుకు సాహ‌సించ‌డం లేదు. దీంతో అంతా స్త‌బ్దుగా ఉంది. అయితే.. విజ‌య‌వాడలో మాత్రం ఒకే ఒక్క కుర్రోడు మాత్రం బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తున్నాడు. ఆయ‌నే దేవినేని అవినాష్ చౌద‌రి. విష‌యం ఏదైనా బ‌లంగా వాద‌న వినిపిస్తున్నారు. మీడియా ముందుకు వ‌స్తున్నారు. తాజాగా విద్యుత్ ఒప్పందాల విష‌యంపై ఆయ‌న వినిపించిన గ‌ళానికి పార్టీ అధినేత జ‌గ‌న్ సైతం ఫిదా అయ్యారు.

నిజానికి విజ‌య‌వాడ‌లో వైసీపీకి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నారు. కానీ, కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక‌.. బొప్ప‌న భ‌వ‌కుమార్‌(విజ‌య‌వాడ వైసీపీ ఇంచార్జ్‌గా ప‌నిచేశారు) స‌హా ప‌లువురు నాయ‌కులు పార్టీకి రాం రాం చెప్పారు. ఇక‌, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగానే ఉన్నారు. ఆయ‌న ఎవ‌రినీ టార్గెట్ చేయ‌డం లేదు. కూట‌మి స‌ర్కారుపై విమ‌ర్శ‌లు కూడా చేయ‌డం లేదు. తాను దేవ‌దాయ శాఖ మంత్రిగా ఉన్న జ‌రిగిన కొన్ని ప‌రిణామాల‌పై ఆయ‌న క‌లత చెందుతున్నారు. ఇప్పుడుతాను బ‌య‌ట‌కు వ‌చ్చి.. మాట్లాడితే ఆ కేసులు చుట్టుకుంటాయ‌న్న భ‌యం కూడా వెంటాడుతోంది.

ఇక‌, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు కూడా మౌనంగా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను త‌ప్పించి టికెట్ కూడా ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది. త‌న‌కు ప్రాధాన్యం లేకుండా పోయింద‌న్న ఆవేద‌న లో ఉన్నారు. దీంతో ఆయ‌న కూడా మీడియా ముందుకు రావ‌డం లేదు. ఒక‌ప్పుడు టీవీ చ‌ర్చ‌ల్లో జోరుగా పాల్గొన్నా.. త‌ర్వాత‌.. త‌ర్వాత మ‌ల్లాది మౌనంగా ఉన్నారు. దీంతో ఎవ‌రూ ముందుకు రాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే..ఈ లోటును భ‌ర్తీ చేస్తూ.. యువ నాయ‌కుడు దేవినేని అవినాష్ జోరుగా ముందుకు సాగుతున్నారు. విద్యుత్ కొనుగోళ్ల నుంచి వ‌లంటీర్ల వ‌ర‌కు అన్ని విష‌యాల‌పైనా స్పందిస్తున్నారు.

దీంతో ఇప్పుడు విజ‌య‌వాడ‌లో వైసీపీ మాట వినిపిస్తున్న ఏకైక నాయ‌కుడిగా.. కుర్రోడుగా కూడా.. వైసీపీలో ఆయ‌న గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక‌, రాజ‌కీయంగా చూసుకుంటే.. ఇప్ప‌టికి 3 సార్లు ప్ర‌జాక్షేత్రంలో పోటీ చేసి ఓడిపోయారు. అయినా.. ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటున్నారు. ఎక్క‌డా నిరాశ లేదు. ఎక్క‌డా బాధ కూడా లేదు. త‌న‌ను తాను మ‌ల్చుకుని.. ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ అవుతున్నారు. ఒప్పుడు తండ్రి దేవినేని రాజ‌శేఖ‌ర్ బ‌లంతో ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చినా.. గ‌త ప‌దేళ్లుగా ఆయ‌న స్వ‌యంగా ఎదుగుతున్నారు. స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తున్నారు. తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. నేనున్నానంటూ ముందుకు సాగుతున్నారు. సో.. వైసీపీలో ఆ కుర్రోడు అంటూ.. దేవినేని అవినాష్‌పై రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.