వైైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కన్న తల్లి విజయమ్మ నుంచే భారీ షాక్ రెడీ అయిపోయిందన్న వాాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీకి చెందిన షేర్ల బదలాయింపు వ్యవహారంలో జగన్, విజయమ్మల మధ్య నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ)లో ఓ భారీ యుద్ధమే జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై బుధవారం ఇరు వర్గాల తరఫు న్యాయవాదులు ఎన్సీఎల్టీలో సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా విజయమ్మ తరఫు న్యాయవాది వివేక్ రెడ్డి అదిరేటి లాజిక్ తో తన వాదనలను గట్టిగా వినిపించారు. చెల్లిపై ప్రేమ, అనురాగం తగ్గిందని జగన్ చెప్పారన్న ఆయన… తల్లిపైై తగ్గిందని చెప్పలేదు కదా అంటూ లాజిక్ తీశారు.
వాస్తవానికి అన్నీ బాగానే ఉండి ఉంటే… సరస్వతీ పవర్ వాటాలన్నీ కూడా జగన్ చెల్లి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎంచక్కా అనుభవిస్తూ ఉండేవారు. అయితే ఎప్పుడైతే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్ కు వ్యతిరేకంగా మారిపోయారో.. అప్పుడే తాను తన తల్లి, చెల్లికి ప్రేమతో బహుమతిగా ఇచ్చిన వాటాలను రద్దు చేయాలంటూ ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఎన్సీఎల్టీలో పలుమార్లు విచారణ సాగగా… బుధవారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. జగన్ తరఫున వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. వాటాల బదలాయింపు పూర్తి కాకుండానే… విజయమ్మ షేర్లను షర్మిలకు ఎలా బదలాయిస్తారని ఆయన కోర్టుకు ఫిర్యాదు చేశారు. అయినా ఫిజికల్ గా వాటాల షేర్లకు సంబంధించిన పేపర్లను బదిలీ చేస్తేనే గిఫ్ల్ డీడ్ చెల్లుబాటు అవుతుందని ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే… ఈ సుదీర్ఘ విచారణలో జగన్ వాదనల కంటే విజయమ్మ వాదనలే బలంగా వినిపించినట్లు సమాచారం. చెల్లిపై ప్రేమ, అనురాగం తగ్గితే… తల్లి ఏం పాపం చేసిందన్న కోణంలో వివేక్ రెడ్డి కీలక పాయింట్ ను ప్రస్తావించారు. అయితే కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న ఈ పంచాయితీని ఎన్సీఎల్టీ విచారించాల్సిన అవసరం లేదన్న ఆయన… జగన్ పిటిషన్ ను డిస్మిస్ చేయాలని కోరారు. సివిల్ కోర్టులో ఈ వివాదం గురించి తేల్చుకోవాలని జగన్ కు సూచించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. అయినా విజయమ్మ తన కుమారుడు జగన్ తోనే కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నప్పుడు ఆమె వద్ద షేర్ల పేపర్లు లేవని ఎలా చెబుతారని కూడా ఆయన ప్రశ్నించారు.
ఓ వైైపు విజయమ్మ, మరోవైపు జగన్ తరఫు న్యాయవాదులు తమ తమ వాదనలను సుదీర్ఘంగా కొనసాగిస్తూ తమ క్లెయింట్లకు అనుకూలంగా తీర్పు వచ్చేలా అన్ని అస్త్రాలనూ వినియోగించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో కోర్టు కూడా ఈ వాదనలను సావదానంగా వినడమే కాకుండా ఒకటి, రెండు సార్లు ఆయా వాదనల్లో జోక్యం చేసుకుంటూ తన అనుమానాలను నివృత్తి చేసుకుంది. అనంతరం ఈ వ్యవహారంపై ఇరువర్గాల వాదనలు పూర్తి అయినట్లుగా కోర్టు ప్రకటించింది. ఈ వివాదంపై తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. వాదనలు పూర్తి అయినట్లుగా కోర్టు ప్రకటిస్తే… ఈ నెల 30 తుది తీర్పు రావడం ఖాయమే కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో విజయమ్మ తరఫు లాయర్ లాజికల్ పాయింట్లు లేవనెత్తడంతో జగన్ కు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశాలున్నాయన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.