తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రచించిన వ్యూహం ఫలించింది. ఫలితంగా మంగళవారం అర్థరాత్రి నుంచి జరగనున్న ఆర్టీసీ సమ్మె వాయిదా పడిపోయింది. ఈ మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తో నిర్వహించిన భేటీ తర్వాత… ఆర్టీసీ సమ్మెను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పై పున:పరిశీలన జరుపుతామని, అందుకు తమకు కొంత సమయం అవసరమని పొన్నం చెప్పడం… అంతేకాకుండా సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించే దిశగా సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నట్లుగా ఆయన చెప్పిన విషయాలపై పునరాలోచన చేసిన కార్మిక సంఘాల ప్రతినిధులు… సమ్మెను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులకు ఫిట్ మెంట్, ఇతరత్రా ప్రయోజనాలను అమలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలు దఫాలుగా కార్మిక సంఘాలు ఆర్టీసీ యాజమాన్యంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వంతోనూ చర్చలు జరిపాయి. అయితే చర్చల్లో పురోగతి లేకపోవడం, తమ డిమాండ్ల పరిష్కారం దిశగా స్పష్టమైన హామీలు లభించని నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లుగా ఇటీవలే ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై ఇటు ఆర్టీసీ యాజమాన్యంతో పాటుగా నేరుగా సీఎం రేవంతే రంగంలోకి దిగారు.
ఈ క్రమంలోనే సోమవారం జరిగిన ఓ సమావేశంలో ఆర్టీసీ సమ్మె, కార్మిక సంఘాల డిమాండ్లను ప్రస్తావించిన రేవంత్ రెడ్డి… రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించి కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సంస్థ నుంచి వచ్చే ఆదాయాన్ని మినహా సింగిల్ పైసాను కూడా ఆర్టీసీ కార్మికులకు కేటాయించే పరిస్థితి లేదని కూడా ఆయన ఒకింత కఠిన వ్యాఖ్యలే చేశారు. అయితే తానేదో ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి వ్యతిరేకం కాదని పేర్కొన్న రేవంత్… సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు మళ్లీ చర్చలు జరుపుదామని, అందుకు కార్మిక సంఘాలు ముందుకు రావాలని కూడా పిలుపునిచ్చారు. రేవంత్ పిలుపు నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం మంత్రి పొన్నంతో కార్మిక సంఘాల ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై దృష్టి సారిస్తామని పొన్నం చెప్పడంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు మెత్తబడ్డాయి.
ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఓ వైపు చర్చలు జరుపుతూనే… మరోవైపు ప్రభుత్వ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సీనియర్ ఐఏఎస్ లు నవీన్ మిట్టల్, లోకేశ్ కుమార్, కృష్ణ సాగర్ లతో కూడిన ఈ బృందం… ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని రేవంత్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని కూడా కార్మిక సంఘాలతో చర్చల సందర్భంగా పొన్నం ప్రస్తావించడంతో కార్మిక సంఘాల ప్రతినిధులు పునరాలోచనలో పడిపోయారు. సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు ఉన్న నేపథ్యంలో సమ్మెను వాయిదా వేయాలని వారు తీర్మానించారు. వెరసి ఆర్టీసీ సమ్మె వాయిదా పడిపోయింది.