‘విష’ ప్ర‌చారానికి ప‌నితీరే విరుగుడు బాబు గారూ..!

కూట‌మి ప్ర‌భుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేప‌థ్యంలో స‌హ‌జంగానే ప్ర‌భుత్వం ఏం చేసిందన్న విషయంపై చ‌ర్చ జ‌రుగుతుంది. అయితే.. ఈ విష‌యంలో ఉన్న‌వీ లేనివీ క‌లిపి ప్ర‌తిప‌క్ష‌ వైసీపీ విష ప్ర‌చారానికి తెర‌దీసే అవ‌కాశం ఉంద‌ని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌న పార్టీ నాయ‌కుల‌ను, మంత్రుల‌ను ఆయ‌న అలెర్ట్ చేస్తున్నారు. విష ప్ర‌చారాన్ని తిప్పికొట్టేందుకు రెడీ కావాల‌ని కూడా ఆయ‌న చెబుతున్నారు.

దీనిపై సుదీర్ఘంగా రెండు గంట‌ల‌పాటు అంత‌ర్గ‌తంగా అందుబాటులో ఉన్న కీల‌క మంత్రుల‌తోనూ చంద్రబాబు చ‌ర్చించారు. త‌మ ప్ర‌భుత్వంపై వైసీపీ చేసే విష ప్ర‌చారాన్ని తిప్పికొట్టాల‌ని ఆయ‌న సూచించారు. దీనికి అంద‌రూ ఓకే చెప్పారు. అయితే.. అస‌లు వైసీపీ చేసే ప్ర‌చారం ఎలా ఉన్నా.. ప‌నితీరుతోనే స‌మాధానం చెప్పాల‌ని మేధావులు సూచిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక‌ప్పుడు రోడ్లు గుంత‌లు ప‌డి.. నడిచేందు కు కూడా ఇబ్బందులు ఉండేది.

దీనిపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో అప్ప‌ట్లో వైసీపీ నాయ‌కులు ఎదురు దాడి చేసేవారు. కొందరైతే.. సంక్షేమానికి సొమ్ములు కేటాయిస్తున్నందున ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు నిధులు లేకుండా పోయాయ‌ని బ‌హిరంగం గానే చెప్పారు. ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేస్తే కేసులు కూడా పెట్టారు. ఫ‌లితంగా వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంది. అదే టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక‌.. ప‌నులు చేయ‌డం ప్రారంభించింది. ర‌హ‌దారులు ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు ఎవ‌రూ విమ‌ర్శించే అవ‌కాశం లేకుండా పోయింది.

అలానే ఇప్పుడు కూడా.. ప‌నితీరుతోనే స‌మాధానం చెప్పాల‌న్న‌ది మేధావులు చెబుతున్న మాట‌. ఎందు కంటే.. మాట‌కు మాట‌.. విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తివిమ‌ర్శ‌లు చేయ‌డం ద్వారా రాజ‌కీయ‌మే అవుతుంద‌ని.. త‌ద్వారా ప్ర‌జ‌ల‌కు స‌రైన సంకేతాలు అంద‌డం కూడా ఇబ్బందే అవుతుంద‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో రాజ‌ధాని అమ‌రావ‌తి స‌హా.. ర‌హ‌దారుల విష‌యంలో ఎలాంటి లైన్ తీసుకుని ముందుకు సాగుతున్నారో.. ఇప్పుడు ఇత‌ర విష‌యాల్లోనూ ప‌నితీరు ఆధారంగానే ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డం మంచిద‌ని చెబుతున్నారు.