వైసీపీ అధినేత జగన్ మరింత బద్నాం అవుతున్నారా? ఆయన చేస్తున్న పనులపై కూటమి సర్కారు ప్రజల్లో ప్రచారం చేస్తోందా ? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ నాయకులు. “ఒక తప్పు కాయొచ్చు..రెండు వరకు సరిపెట్టుకోవచ్చు. కానీ, పదే పదే తప్పులు చేసుకుంటూ పోతే.. జగన్ బద్నాం కాక ఏమవుతారు. ఇంతకన్నా ఏం చెప్పలేం” అని వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల్లో ఉండడం అనేది రాజకీయ నాయకుల లక్షణం. పైగా తనపాలనపై మరకలు, మచ్చలు పడ్డాక వాటిని తుడుపుకొనేందుకైనా జగన్ ప్రయత్నించి ఉండాలి. ప్రయత్నించాలి కూడా!
కానీ, ఆ దిశగా జగన్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. పైగా.. ఉంటే తాడేపల్లి, లేకపోతే బెంగళూరు అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. దీంతో కూటమి నాయకులు ఆడేసుకుంటున్నారు. వర్క్ ఫ్రమ్ బెంగళూరు’ టైటిల్ ఇచ్చేశారు. రాష్ట్రంలోని రైతుల దుస్థితి, సీఎం చంద్రబాబు పనితీరుపై జగన్ చేసిన కామెంట్లకు స్పందించిన మంత్రి నాదెండ్ల మనోహర్.. ఇలానే వ్యాఖ్యానించారు. మంత్రి అనిత కూడా.. ఇదే కామెంట్లు చేశారు. ‘వర్క్ ఫ్రమ్ బెంగళూరు’ చేసే జగన్‌కు రాష్ట్రంలో పరిస్థితులు ఏమర్థమవుతాయని వ్యాఖ్యానించారు. ‘ఉంటే తాడేపల్లి.. లేకపోతే బెంగళూరు. ఇంతేగా.. జగన్ తీరు’ అని ఎద్దేవా చేస్తున్నారు.
ఇక, జగన్ పనితీరు కూడా అలానే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లికి పరిమితమైన ఆయన .. ప్రస్తుతం బెంగళూరు లోనే ఎక్కువగా ఉంటున్నారు. కారణాలు ఏవైనా నెలలో 15-20 రోజులు బెంగళూరులోని ప్యాలస్‌లోనే ఉంటున్నారన్నది వైసీపీ నాయకులు సైతం చెబుతున్న మాట. ఇది.. కూటమి సర్కారు నాయకులకు కలిసి వచ్చింది. జగన్ చేసే విమర్శలకు చెక్ పెట్టడంతోపాటు.. వర్క్ ఫ్రమ్ బెంగళూరు టైటిల్‌తో ఇరగదీస్తున్నారు. రాబోయే రోజుల్లే ఇదే స్థిరపడితే.. జగన్‌ను నాన్‌లోకల్ గా చూసే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.
ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబును ఇలానే వైసీపీ నాయకులు వ్యాఖ్యానించారు. దీంతో ఆయన తన మకాంను ఉండవల్లికి మార్చుకుని.. రాజధాని పరిధిలోనే సొంతగా ఇల్లు నిర్మించుకుంటున్న విషయం తెలిసిందే. మరి జగన్‌కు ఇక్కడ సొంత ఇల్లు ఉన్నా.. బెంగళూరులోనే ఎక్కువగా ఉండడం, అక్కడ నుంచే సోషల్ మీడియాలోనూ స్పందించడం వంటివి రాజకీయంగా ఆయనకు మైనస్ అయ్యే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates