వైసీపీ టాక్‌: ఆ ఒక్క‌డే అన్నీ తానై.. !

వైసీపీలో నాయ‌కులు చాలా మంది డి-యాక్టివేష‌న్‌లో ఉన్నారు. కాక‌లు తీరిన క‌బుర్లు చెప్పిన నాయ‌కులు కూడా మౌనంగా ఉంటూ.. ర‌మ‌ణ మ‌హ‌ర్షుల‌ను మించిపోయారు. దీంతో పార్టీ వాయిస్ వినిపించే వారు లేకుండా పోయారు. ఎవ‌రిని ప‌ల‌క‌రించినా.. నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. ఎవ‌రిని ప‌ల‌క‌రించినా.. కేసులు.. కోర్టులు.. బెయిళ్లంటూ.. తీరిక‌లేని ప‌నుల్లో మునిగిపోయారు. ఒక కేసు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి బెయిల్ తెచ్చుకుంటే మ‌రో కేసు వారిని వెంటాడుతోంది.

ఇలాంటి స‌మ‌యంలో ఒకే ఒక్క నాయ‌కుడు అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం దక్కి చుకున్న న‌లుగురు ఎంపీల్లో తిరుప‌తి పార్ల‌మెంటు స‌భ్యుగు మ‌ద్దెల గురుమూర్తి ఒక్క‌రే ప్ర‌జ‌ల్లో క‌నిపిస్తు న్నారు. వాయిస్ వినిపిస్తున్నారు. ప్ర‌భుత్వంపై నా ఆయ‌న విమ‌ర్శ‌లు చేస్తున్నారు. కేంద్రానికి ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇక‌, పార్టీ నాయ‌కుల‌కు కూడా ఆయ‌న అందుబాటులో ఉంటున్నారు. ఎక్క‌డ ఏ అవ‌స‌రం వ‌చ్చినా.. నేనున్నానంటూ.. వ‌స్తున్నారు.

మిగిలిన వారిలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి మ‌ద్యం కేసులో చిక్కుకున్నారు. దీనికి తోడు మ‌ద‌న ప‌ల్లె ఫైళ్ల ద‌గ్ధం కేసులో పెద్దిరెడ్డి కుటుంబం పాత్ర ఉంద‌న్న కేసులు న‌మోదయ్యాయి. దీంతో వీరు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావ‌డం లేదు. పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ముగ్గురు విజ‌యం ద‌క్కించుకున్నా.. ఒక్క‌రూ ప్ర‌జ‌ల‌కు చేరువ కాలేక‌పోతున్నారు. ఇక‌, క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి ప‌రిస్థితి కూడా అలానే ఉంది. స్థానికంగా ఉంటున్నా.. ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు.

ఇక‌, అర‌కు నుంచి విజ‌యం ద‌క్కించుకున్న వైసీపీ ఎంపీ త‌నూజా రాణి.. కూడా నియోజ‌క‌వ‌ర్గానికి దూరం గానే ఉంటున్నారు. వాస్త‌వానికి ఈమె కొత్త నాయ‌కురాలు. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు భారీ అవ‌కాశం ఉంది. అయినా.. కూడాఆమె దూరంగానే ఉంటున్నారు. పైగా ఆమె జ‌న‌సేన‌లోకి వెళ్లే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న ప్ర‌చారం కూడా ఉంది. దీంతో ఇప్ప‌టికిప్పుడు.. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్న నాయ‌కుడిగా గురుమూర్తి ఒక్క‌రే అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం.