ఉత్తరాంధ్ర ఇలవేల్పు .. విశాఖపట్నం జిల్లాలోని వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయమైన సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం నేడు. ఏడాదికి ఒక్కసారి జరిగే ఈ చందనోత్సవం నాడు మాత్రమే స్వామి వారి నిజరూప దర్శనం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఒక్కరోజు కోసం.. 364 రోజులు వేచి చూసే భక్తులు స్వామి ఆలయానికి పోటెత్తుతారు. అలానే.. ఈ రోజు(బుధవారం) కూడా భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు.
అయితే.. ఈ సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలింది.
దీంతో భక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఊపిరాడక.. 8 మంది భక్తులు మృతి చెందా రు. వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, పోలీసు ఉన్నతాధికారి శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.
మీదే తప్పు.. కాదు మీదే!
తాజాగా జరిగిన గోడ కూలిన ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోని కారణంగానే.. గోడ కూలి భక్తులు మృతి చెందారని వైసీపీ నాయకులు విమర్శించారు. అయితే.. అసలు ఆ గో డలో నాణ్యత లేని కారణంగానే.. అది కూలిపోయిందని వైసీపీ నాయకులకు హోం మంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. ఆ గోడ ఎప్పుడు కట్టారో.. నాణ్యత ఏమిటో తెలుసుకునేందుకు కమిటీ వేసి విచారణ చేస్తామని.. బాధ్యులను శిక్షిస్తామని మంత్రి హెచ్చరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates