రూ. 224 కోట్ల భారీ జరిమానా విధించిన ఈడీ

నిబంధనలను అతిక్రమించి విదేశీ కంపెనీతో వ్యాపారం చేసిన కారణంగా ఓ జ్యువెలరీ కంపెనీకి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అత్యంత భారీ జరిమానాను విధించింది. మనదేశ చరిత్రలో ఈడీ రూ. 224 కోట్ల అత్యంత బారీ జరిమానా విధించి రికార్డు సృష్టించింది. ఇంతకీ విషయం ఏమిటంటే న్యూఢిల్లీ కేంద్రంగా సుఖేష్ గుప్తా అనే వ్యాపారి ముసద్దీలాల్ జ్యువెలర్స్ పేరుతో వజ్రాలు, బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తున్నారు.

తన వ్యాపారాన్ని విస్తరించే ఉద్దేశ్యంతో విదేశాల్లోని సంస్ధలతో వ్యాపారం చేయాలని అనుకున్నారు. హాంకాంగ్ లోని లింక్ పై అనే సంస్దతో వ్యాపార ఒప్పందాన్ని చేసుకున్నారు గుప్తా. విదేశీ సంస్ధతో వ్యాపార లావాదేవీలు చేయటానికి సుఖేష్ ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. కొద్ది సంవత్సరాలుగా హాంకాంగ్ కంపెనీతో సుఖేష్ చేసిన అక్రమవ్యాపారం చివరకు బట్టబయలైంది.

తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగా ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ అధికారులు జరిపిన దర్యాప్తులో సుఖేష్ చేస్తున్న మొత్తం వ్యాపార వ్యవహారాలన్నీ బయటపడ్డాయి. దాంతో ఒక్కసారా ఎంబిఎస్ సంస్ధపై దాడులు జరిపిన అధికారులు వ్యాపారం మొత్తాన్ని సీజ్ చేసేశారు. తర్వాత అంతర్గతంగా జరిపిన తనిఖీల్లో హాంకాంగ్ సంస్ధతో జరిపిన వ్యాపారం మొత్తం బయటపడింది. ఈడీ అధికారులకు దొరికిన ఆధారాల ప్రకారం సుమారు రూ. 100 కోట్ల విలువైన బంగారం, వజ్రాలను అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు కనుక్కున్నారు.

విదేశీ కంపెనీలతో వ్యాపారం చేసేటపుడు ఫారిన్ ఎక్స్చేంజ్ మెయిన్ టెనెన్స్ యాక్ట్ (ఫెమా) నిబంధనలను సుఖేష్ ఉల్లంఘించిన విషయం ఆధారాలతో సహా నిరూపణయ్యింది. దాంతో రూ. 224 కోట్ల అత్యంత భారీ జరిమానా విధించింది ఈడీ. తనకు పడిన అంత భారీ జరిమానాను సుఖేష్ కట్టగలడా లేదా అన్నది ఆసక్తిగా మారింది.