తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు.. అన్న సామెత వైసీపీ అధినేత జగన్ విషయంలో అక్షరాలా నిజమవుతోంది. అనేక మంది నాయకులు, అధికారులు పోలీసుల కేసుల్లో చిక్కుకున్నారు. కొందరు ఇప్పటికీ జైళ్లలోనే ఉన్నారు. వీరికి బెయిల్ కూడా లభించడం లేదు. ఇక, అధికారుల సంగతి సరేసరి! ఎప్పుడు ఎలాంటి కేసు తమకు చుట్టుకుంటుందో అని వైసీపీ హయాంలో చక్రం తిప్పిన అధికారులు బిక్కు బిక్కు మంటున్నారు.
ఈ పరిణామాలు.. వైసీపీ అధినేత జగన్ చుట్టూ ముసురుకున్నాయి. ఆయన నోరు మెదపకపోవడం.. మౌనంగా ఉండడం .. వంటివి.. ఆయనను బోను ఎక్కిస్తున్నారు. జగన్‌కు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారు కూడా.. ఇప్పుడు ఆయన వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. “నాడు అధికారం చూసుకుని రెచ్చిపోయారు. ఆనాడు ఆయన(జగన్)కు తెలిసే ఇవ్వన్నీ జరిగాయన్న ప్రచారం బలంగా ఉంది. దీనిని ఆయన అప్పట్లో ఖండించలేదు. పోనీ.. అదుపు కూడా చేయలేదు” అని తూర్పుకు చెందిన సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.
ఇక, ఇప్పుడు కూడా జగన్ మౌనంగా ఉన్నారని.. దీనిని ఎలా అర్ధం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. ప్రతివిషయాన్నీ.. జగన్ ఎలా చూస్తున్నారన్నది పక్కన పెడితే.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, మద్యం, ఇసుక కుంభకోణాలు, అధికారుల వ్యవహార శైలిపై దాఖలవుతున్న కేసులు .. వంటి చూస్తే.. జగన్ తన తప్పులు ఒప్పుకొంటున్నారా? అనే చర్చ జరుగుతోందని సదరు నాయకుడు చెప్పారు. దీనిని బట్టి.. జగన్ తప్పులపై తప్పులు చేశారన్న అభిప్రాయం ప్రజల్లోమరింత బలపడుతోందన్నారు.
ఈ విషయంపై దాదాపు వైసీపీ తటస్థ నాయకులు అందరూ కూడా.. ఇదే విధంగా మాట్లాడుతుండడం గమనార్హం. ఈ పరిణామాలు వైసీపీ అధినేతకు కనిపించడం లేదా? లేక వినిపించడం లేదా? అనే అనుమానా లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా.. జగన్ బయటకు వచ్చి వాస్తవాలు చెప్పకపోతే.. మరో 10 ఏళ్ల పాటు తమ పార్టీకి కష్టాలు తప్పవని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఓపెన్ కాకపోయినా.. అంతర్గత చర్చలు.. మీడియా మిత్రులతో వారు ఇదే మాట చెబుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates