తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత ఏడాది జనసేన పార్టీ విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. సీమలో బలమైన బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆరణి శ్రీనివాసులకు పార్టీ టికెట్ ఇవ్వడం, ఆయన విజయం దక్కించుకోవడం తెలిసిందే. వైసీపీ నుంచి ఎన్నికలకు ముందు.. జనసేనలో చేరిన ఆరణి.. అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నారు. ఇదిలావుంటే.. ఆయన వ్యవహారంపై.. అనేక ఆరోపణలు వస్తున్నాయి. వీటిలో రెండు కీలక విషయాలు ఉండడం గమనార్హం.
జనసేననాయకులతో సఖ్యత లేకపోవడం. వాస్తవానికి పార్టీలు మారిన తర్వాత.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టాల్సిన పరిస్థితి నాయకులకు ఉంటుంది. అప్పటి వరకు వేరే పార్టీలో ఉన్నా.. ఆ పార్టీ వాసనలు వదులుకుని.. కొత్తగా వచ్చిన పార్టీకి ఎడాప్ట్ కావాలి. అయితే.. ఆరణి విషయంలో అది సాధ్యం కాకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని జనసేన నాయకులే చెబుతున్నారు. జనసేన కార్యకర్తలతోనే కాదు.. కీలక నాయకులతోనూ.. ఆరణి డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నట్టు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
పార్టీ కీలక నాయకులు.. నాగబాబు వచ్చినప్పుడో.. మంత్రి నాదెండ్ల మనోహర్ వచ్చినప్పుడో.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వచ్చినప్పుడో మాత్రమే.. ఆరణి కనిపిస్తున్నారు. ఇతర నాయకులతో కనీసం. ఆయన టచ్‌లోకూడా ఉండడం లేదని.. ఫోన్లు కూడా మార్చేస్తున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు.. అసలు ఆరణి కన్నా.. ఆయన అన్న కుమారుడు, తన కుమారుడు కలిసి.. నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారన్నది రెండో ఆరోపణ.
అన్న కుమారుడు జగన్, తన కుమారుడు మదన్‌లే తిరుపతిలో అన్నీ తామై చక్రం తిప్పుతున్నారని జనసేన నాయకులే గుసగుసలాడుతున్నారు. అదేమంటే.. తనకు ఆరోగ్యం బాగోలేదని.. ఆరణి చెబుతున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో ఏం కావాలన్నా.. చేతులు తడపాల్సిన పరిస్థితి తప్పడం లేదని.. రాజకీయ నాయకులు విస్తుపోతున్నారు. ఇక, సామాన్యులకు ఎమ్మెల్యే కానీ.. ఆయన కుమారులు కానీ.. అందుబాటులో లేకుండా పోతున్నారని.. కేవలం పెద్దవారితో పెద్దడీల్స్ చేయడంలోనే వారు బిజీబిజీగా ఉంటున్నట్టు చర్చ సాగుతోంది. ఏదేమైనా.. ఆరణి వ్యవహారం.. నివురుగప్పిన అగ్గిలా రాజుకుంటోంది. ఇది.. వైసీపీకి మేలు చేసినా.. చేయొచ్చన్న చర్చ జనసేనలోనే వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates