జమ్ము కశ్మీర్‌లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది దేశం పాకిస్థాన్‌పై నిప్పులు చెరుగుతున్న భారత్.. మన దేశంలో తిష్టవేసిన పాకిస్థాన్ పౌరులను దేశం విడిచి పోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నెల 30 నాటికి పాకిస్థాన్‌కు చెందిన ఏ ఒక్కరూ దేశంలో ఉండడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో రాష్ట్రాలను కూడా అలెర్ట్ చేసింది. ముఖ్య మంత్రులకు స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఫోన్లు కూడా చేశారు.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నుంచి ఆయా రాష్ట్రాల్లో పాకిస్థాన్ పౌరులు ఉంటున్నట్టుగా భావిస్తున్న ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో గుజరాత్ వ్యవహారం తెరమీదికి వచ్చింది. గత రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నిర్వహించిన సెర్చ్‌లో దాదాపు 1000 మందికి పైగా పాకిస్థాన్ పౌరులు గురజాత్‌లో అనధికారికంగా ఉంటున్నట్టు అధికారులు గుర్తించారు. వీరిని ఇళ్ల బయటకు తీసుకు వచ్చి భారీ పెరేడ్ నిర్వహించారు. తక్షణమే వీరిని వాఘా సరిహద్దులు దాటిస్తామని అధికారులు తెలిపారు.
ఇదిలావుంటే.. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే కూడా.. గుజరాత్‌లోనే పాకిస్థాన్ పౌరులు ఎక్కువగా ఉండడం పట్ల.. విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం కావడం.. గత 20 సంవత్సరాలుగా బీజేపీ ఇక్కడ అధికారంలో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ మేరకు సజావుగా ఉన్నాయన్నది ఈ ఘటన రుజువు చేస్తోందని.. కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే ప్రశ్నించారు. మరోవైపు.. హైదరాబాద్‌లోని పాక్ బజార్‌లోనూ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.