మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అందిన కాడికి దండుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజినీకి శుక్రవారం హైకోర్టులో షాక్ తగిలింది. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్డపాడులో ఓ స్టోన్ క్రషింగ్ కంపెనీ యాజమాన్యాన్ని బెదిరించి… రూ.2.2 కోట్లను వసూలు చేశారంటూ రజినీ సహా ఆమె మరిది గోపీ, ఆమె పీఏ రామకృష్ణతో పాటు నాడు విజిలెన్స్ ప్రాంతీయ అధికారిగా పనిచేసిన ఐపీఎస్ అధికారి జాషువాపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ఉండేలా బెయిల్ మంజూరు చేయాలంటూ రజినీతో పాటు ఆమె మరిది గోపీ కూడా ఇదివరకే హైకోర్టులో బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు రజినీకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఏసీబీ విచారణకు సహకరించాల్సిందేనని కోర్టు రజినీని ఆదేశించింది.
రజినీ, ఆమె మరిది గోపీల బెయిల్ పిటిషన్లను కోర్టులో విచారణ దశలో ఉండగానే… గురువారమే హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు గోపీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గోపీని విజయవాడ తరలించిన ఏసీబీ… ఆయనను విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా… గోపీని రిమాండ్ కు తరలిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామం జరిగిన తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్లపై విచారణ జరగగా… గోపీని ఇప్పటికే అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని, ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించిందని ఏసీబీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీంతో గోపీ తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత రజినీ బెయిల్ పిటిషన్ పై మాత్రమే విచారణ చేపట్టింది. బెయిల్ ఇవ్వడం కుదరదన్న హైకోర్టు… ఏసీబీ విచారణకు సహకరించాలని రజినీకి సూచించింది.
అయితే రజినీకి ఒకింత ఊరట కలిగేలా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రజినీకి 41ఏ నోటీసులు జారీ చేసి విచారణ చేయాలని కోర్టు ఏసీబీ అధికారులకు సూచించింది. బెయిల్ రాకపోయినా… 41ఏ నోటీసుల ప్రకారం విచారణ చేయాలన్న హైకోర్టు ఆదేశాలు రజినీకి నిజంగానే ఊరట కలిగించేవేనని చెప్పక తప్పదు. రజినీతో పాటు ఆమె పీఏ రామకృష్ణకు కూడా 41 ఏ నోటీసుల ఆధారంగానే విచారించాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే… గురువారమే గోపీని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టు ఏమాత్రం ఆలస్యం అయినా… రజినీ మాదిరిగానే గోపీని కూడా 41ఏ నోటీసుల ఆధారంగానే విచారించాలని హైకోర్టు ఆదేశించి ఉండేదేమోనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగి ఉండే.. కొంతకాలమైనా గోపీ అరెస్టు నుంచి ఉపశమనం పొంది ఉండేవారేమోనన్న వాాదన లేకపోలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates