జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జనసేన శ్రేణులతో కొంతకాలంగా అంటీ ముట్టనట్టుగా సాగుతున్న టీడీపీ సీనియర్ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ… పవన్ టూర్ లో మాత్రం ఆ తరహా వైఖరికి స్వస్తి చెప్పేశారు. అంతేకాకుండా పిఠాపురంలో టీడీపీ, జనసేనల మధ్య ఓ రేంజిలో అభిప్రాయ భేదాలు ఉన్నాయన్న వార్తలకు చెక్ పెడుతూ పవన్ టూర్ లో ఆయన ఉత్సాహంగా కనిపించారు. పవన్ కూడా వర్మకు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటుగా తాను పాలుపంచుకున్న కార్యక్రమాల్లో వర్మకు ప్రాధాన్యం దక్కేలా చూసుకున్నారు. వెరసి పిఠాపురం టీడీపీ, జనసేన శ్రేణుల్లో మునుపటి మాదిరే ఉత్సాహం వెల్లివిరిసింది.
తన సొంత నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు శుక్రవారం పవన్ పిఠాపురం పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి వర్మ హాజరయ్యారు. పవన్ తో పాటు ఆసుపత్రి భవన శంకుస్థాపనలో ఆయన ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. శంకుస్థాపనలో భాగంగా శిలాఫలకాన్ని పవన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శిలాఫలకానికి ఓ వైపున పవన్ నిలవగా… ఆయనకు అభిముఖంగా శిలాఫలకానికి మరో వైపున వర్మ నిలబడ్డారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన తర్వాత వర్మకు పవన్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర నేతలతోనూ పవన్ చేయి కలిపారు.
ఇటీవలే పిఠాపురంలో పవన్ సోదరుడు, జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా వర్మ… నాగబాబు టూర్ కు పూర్తిగా దూరంగా ఉన్నారు. అంతేకాకుండా జనసేన శ్రేణుల నినాదాలకు ప్రతిగా టీడీపీ శ్రేణులు కూడా పోటాపోటీ నినాదాలు చేశాయి. దీంతో ఇరు పార్టీల మధ్య పొరపొచ్చాలు మొదలయ్యాయన్న విశ్లేషణలు సాగాయి. పవన్ కోసం తన ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ ఇస్తానని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వివిధ కారణాల వల్ల ఇప్పటిదాకా ఈ హామీ అయితే అమలు కాలేదు. అదే సమయంలో నాగబాబుకు మాత్రం ఎమ్మెల్సీగా అవకాశం దక్కిందన్న భావన జనసేన శ్రేణులను ఒకింత అసంతృప్తికి గురి చేసిందన్న వాదనలు వినిపించాయి. ఈ కారణంగానే వారు నాగబాబు టూర్ లో టీడీపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించాయన్న విశ్లేషణలు సాగాయి.
ఇదిలా ఉంటే… ఈ పరిణామాలను వర్మ పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. ఇటీవలే విజయవాడలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన సందర్భంగా… ఆ కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబుతో వర్మ కలిశారు. ఇరువురు నేతలు కరచాలనం చేసుకుని మరీ సంతోషంగానే కనిపించారు. పార్టీ అధినేతగా చంద్రబాబుకు ఎన్నో ఒత్తిడులు ఉంటాయని, ఈ క్రమంలో అనుకున్నవన్నీ అప్పటికప్పుడే జరగాలంటే కుదరదు కదా అన్న మాటను కూడా వర్మ వ్యక్తపరిచారు. తాజాగా పిఠాపురానికి పవన్ రావడం… పవన్ టూర్ లో వర్మ స్వయంగా పాలుపంచుకోవడాన్ని చూస్తుంటే… ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై వర్మకు పెద్డగా అసంతృప్తే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏమైతేనేం… పవన్ టూర్ లో వర్మ ఉత్సాహంగా సాగడం పట్ల ఇటు టీడీపీ, అటు జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.