వైసీపీ నాయకురాలు..మాజీ మంత్రి విడదల రజనీకి భారీ షాక్ తగిలింది. ఆమె మరిది.. విడదల గోపీని ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఇతర రాష్ట్రాలకు పారిపోయేందుకు రెడీ అవుతున్నాడన్న సమాచారం తో హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న ఏసీబీ అధికారులు ఆయనను గురువారం తెల్లవారు జామున 5.30 గంటల సమయంలో అరెస్టు చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు ఇతర దేశాలకు వెళ్లేందుకు గోపి షెడ్యూల్ చేసుకున్నట్టు ఏసీబీ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో అలెర్టయి వెంటనే అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం.. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు.
ఏంటి కేసు?
విడదల రజనీ మంత్రిగా ఉన్నసమయంలో పల్నాడు జిల్లాలోని యడ్లపాడు గ్రామంలో ఉన్న శ్రీలక్ష్మి క్వారీ యజమానిని బెదిరించారన్న కేసు ఉంది. క్వారీ అనుమతులు నిలిపివేస్తామని.. లెక్కకు మించి తవ్వకాలు చేస్తున్నారని.. జీఎస్టీ ఎగవేస్తున్నారని… బెదిరించారు. ఈ క్రమంలో అప్పటి ఐపీఎస్ అధికారి పల్లె జాషువా కూడా.. రజనీ చెప్పినట్టు విన్నారు. ఈ బెదిరింపుల్లో ఆయనకు కూడా భాగస్వామ్యం ఉందని ఏసీబీ అధికారులు గుర్తించి.. రెండు సార్లు విచారణకు పిలిచారు. ఈ విచారణలో తనప్రమేయం ఏమీ లేదని.. అప్పటి మంత్రి ఏం చెబితే అదే చేశానని ఆయన వెల్లడించారు.
ఇక, ఈ బెదిరింపుల ద్వారా సుమారు 2 కోట్ల రూపాయలను మంత్రి తీసుకున్నట్టు యజమాని తెలిపారు. మరో 50 లక్షలను పోలీసులు కూడా తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా భావించిన కూటమి సర్కారు…ఏసీబీని విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే విడదల రజనీ.. ఆమె ఇద్దరు మరుదుల ప్రమేయం ఉందని…వారే క్వారీ యజమానిని బెదిరించి… సొమ్ములు వసూలు చేశారని గుర్తించారు. దీనిలో అప్పటి మంత్రి రజనీ పాత్ర కూడా ఉందని తేల్చారు.
దీంతో తనను అరెస్టు చేయకుండా.. రజనీ.. హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే..దీనిపై విచారణ వాయిదా పడుతోంది. ఇంతలోనే ఆమె మరిది విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమచారం అందడంతో పోలీసులు అలెర్టయి.. ఆయనను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. దీంతో ఈ కేసు.. మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు పోలీసులు.