జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ మారణ హోమం.. దేశాన్నే కాదు.. ప్రపంచ దేశాలను కూడా కుదిపేస్తోంది. దేశంలో ఉగ్రవాదానికి చాలా మటుకు తుదముట్టించామని.. ఇప్పుడు అంతర్గత శత్రువులతో(రాజకీయ నేతలు) పోరాడుతున్నామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పిన రెండు రోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం.. ఏపీ సహా పలు ప్రాంతాలకు చెందిన పర్యటకులు ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోవడం.. మరో వందల సంఖ్యలో పర్యాటకులు స్థానికంగా చిక్కుకు పోవడం వంటివి దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఏపీ విషయానికి వస్తే.. కడపటి వార్తలు అందేసరికి.. ఇద్దరు మృతి చెందారు. నెల్లూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఒకరు, విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఒకరు ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పాయారు. ఇక, ఈ మారణ హోమం విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోడీ తన విదేశీ పర్యటనను ముగించుకుని పాకిస్థాన్ మీదుగా రాకుండా.. ప్రత్యామ్నాయ మార్గంలో భారత్‌కు చేరుకున్నారు. ఇదిలావుంటే.. అసలు పహల్గామ్ మారణ హోమానికి కారణాలు ఏంటి? అంతర్గత ఉదాశీనతేనా? అంటే.. ఔననే అంటున్నారు ఆర్మీకి చెందిన మాజీ సైనికాధికారులు.
1) ఇంటెలిజెన్స్ నివేదికలను పట్టించుకోకపోవడం: ఈ విషయాన్ని చాలా మంది సీనియర్ అధికారులు తప్పుబడుతున్నారు. ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చి 15 రోజులు అయిందని.. అయినప్పటికీ సీనియర్ అధికారులు ఉదాశీనంగా వ్యవహరించారని చెబుతున్నారు. పహల్గామ్ లో ఏమాత్రం ఇబ్బంది లేదన్న పాత నివేదికలను పట్టుకుని వేలాడారన్నది వారు చెబుతున్న మాట. ఈ అతిశయమే ఇప్పుడు కొంపముంచిందని అంటున్నారు.
2) ఆర్మీ రిక్రూట్‌మెంట్లు లేకపోవడం: కరోనా తర్వాత.. దేశంలో నేరుగా ఆర్మీ రిక్రూట్‌మెంట్స్‌ను నిలిపివేశారు. అగ్నివీర్‌ను తీసుకువచ్చినా.. వివాదాలసుడిలో చిక్కుకోవడం.. వారంతా కొత్తవారు కావడంతో సరైన రీతిలో బలగాలను మోహరించలేని పరిస్థితి ఏర్పడిందని సీనియర్ రిటైర్డ్ అధికారులు చెబుతున్నారు. పైగా చైనాతోనే ముప్పు ఎక్కువగా ఉందన్న కారణంగా.. చైనా సరిహద్దుల్లోనే సైన్యాన్నిఎక్కువగా మోహరించిన ఫలితంగా ఇప్పుడు ఇప్పుడు ఈ దుస్థితి వచ్చిందని అంటున్నారు.
3) విధాన పరమైన నిర్ణయం: జమ్ము కశ్మీర్‌ను విడదీసి.. కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ములోని కొంత భాగాన్ని కేటాయించినా.. అక్కడ శాంతి భద్రతల సమస్య కొనసాగుతోంది. దీనికి తోడు.. స్థానికంగా రాజకీయాలు అస్థిరత్వంతో కూడుకుని ఉన్నాయి. ఈ నిర్ణయం ఫలితంగానే ఉగ్రవాదులకు పహల్గామ్ మార్గం రెడ్ కార్పెట్ పరిచినట్టు అయిందన్న వాదన వినిపిస్తోంది. ఏదేమైనా మోడీ పాలన పది సంవత్సరాల్లో ఇదే భారీ ఉగ్రదాడిగా చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates