ఏపీ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ దాదాపుగా ఏడాదికి పైగానే వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వస్తున్నారు. దువ్వాడకు సంబంధించి ఏ వార్త వచ్చినా అది ఇట్టే వైరల్ అయిపోయింది. కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన పిల్లలను వదిలేసిన దువ్వాడ… దివ్వెల మాధురితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దివ్వెల మాధురితో కలిసి దువ్వాడ హైదరాబాద్ లో ఓ చీరల దుకాణాన్ని కూడా తెరిచారు. తాజాగా దువ్వాడను పార్టీ నుంచి బహిష్కరిస్తూ వైసీపీ మంగళవారం రాత్రి కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దువ్వాడను బహిష్కరిస్తున్నట్లు ఓ ప్రకటనలో వైసీపీ వెల్లడించింది. అయితే ఈ ప్రకటన, దానిపై జనం స్పందిస్తున్న తీరును బట్టి చూస్తే.. దువ్వాడను సస్పెండ్ చేయడం జగన్ కు ససేమిరా ఇష్టం లేదన్న మాట గట్టిగానే వినిపిస్తోంది.
ఎక్కడికి వెళ్లినా మాధురితోనే కలిసి వెళుతున్న దువ్వాడ… ఆయా పర్యటనలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ… వాటికి వస్తున్న వ్యూస్, లైకులను చూసి తెగ సంబరపడిపోతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే మాధురితో దువ్వాడకు అత్యంత సన్నిహిత సంబంధం ఉందని జగన్ కు తెలుసు. నాడు టెక్కలి సీటును దువ్వాడకు కాకుండా తనకు ఇవ్వాలని ఆయన సతీమణి వాణి నేరుగా జగన్ నే కోరారు. ఇందుకు కారణం ఏమిటన్న దానిని జగన్ కు చెప్పిన వాణి… మాధురీతో కలిసి దువ్వాడ తిరుగుతున్నారని, తమను వదిలేశారని కూడా ఆమె ఫిర్యాదు చేశారు. అయితే అది మీ కుటుంబ వ్యవహారం అని, దానిని మీరే తేల్చుకోవాలంటూ చెప్పిన జగన్ నాడు తప్పించేసుకున్నారు. ఆ తర్వాత దువ్వాడకే టికెట్ ఇచ్చినా ఆయన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.
ఎన్నికల తర్వాత దువ్వాడ ఫ్యామిలీలో మాధురి వ్యవహారంపై పెద్ద రచ్చే జరిగింది. అయినా కూడా వైసీపీ కనీసం స్పందించలేదు. కనీసం దువ్వాడను పిలిచి మందలించే కనీస బాధ్యతను కూడా జగన్ చేపట్టలేదు. ఏదో వేరే పార్టీ నేత ఇంటిలో ఈ రచ్చ జరుగుతున్నట్లుగానే జగన్ సాగారు. ఇదే అదనుగా దువ్వాడ..మాధురితో కలిసి ఏకంగా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేశారు. తిరుమలలోనూ వారిద్దరూ కనిపించి…సెల్ఫీలు దిగి కూడా వివాదంలో చిక్కుకున్నారు. ఇంత జరిగినా కూడా జగన్ పట్టించుకోలేదు. ఈ లెక్కన దువ్వాడపై చర్యలకు జగన్ ససేమిరా అన్నారనే విశ్లేషణలు సాగుతున్నాయి. అంతేకాకుండా దువ్వాడ, మాధురీల విహారాలను జగన్ ఎంజాయ్ చేసినట్లుగానే పలు వర్గాల నుంచి ఆసక్తికర కామెంట్లు వినిపించాయి. అలాంటి జగన్… దువ్వాడను పార్టీ నుంచి ఎలా సస్పెండ్ చేశారన్నదే ఇప్పుడు అంతుపట్టడం లేదు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ పీఏసీ సమావేశం జరిగింది. పీఏసీని పునర్వ్యవస్థీకరించిన తర్వాత జరిగిన తొలి భేటీలో పలువురు నేతలు పార్టీలో జరుగుతున్న పలు కీలక పరిణామాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా దువ్వాడ అంశమూ ప్రస్తావనకు రాగా…ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు కూడా దువ్వాడ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారట. ఈ తరహా వ్యవహారాలపై చర్యలు లేకపోతే పార్టీకి నష్టమేనని తేల్చి చెప్పారట. నేతలంతా ఇలా ఒక్కసారిగా దువ్వాడ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా… విధి లేని పరిస్థితిలోనే దువ్వాడపై చర్యలకు జగన్ ఇష్టం లేకున్నా కూడా ఓకే చెప్పారని సమాచారం. దీంతో దువ్వాడపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన పార్టీ క్రమశిక్షణా కమిటీ ఆయనను సస్పెండ్ చేయాలని జగన్ కు సూచించిందని… దీంతో దువ్వాడ సస్పెన్షన్ కు జగన్ ఆదేశాలు జారీ చేశారని పార్టీ సదరు ప్రకటనలో తెలిపింది.