ఏపీలో వైసీపీ పాలనలో చీపు లిక్కరును మద్యం బాబులకు అంటగట్టి.. భారీ ధరలతో వారిని దోచేసిన విషయం తెలిసిందే. అన్నీ ప్రభుత్వ మద్యం దుకాణాలే కావడం.. ఎక్కడా ఫోన్‌పే, గూగుల్ పే వంటి వాటినివినియోగించకపోవడం ద్వారా భారీ ఎత్తున నగదు అక్రమాలు జరిగాయని అప్పట్లోనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిని కూటమి సర్కారు వచ్చాక దుమ్ముదులిపే ప్రయత్నం చేసింది. తాజాగా కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి..ఉరఫ్ రాజ్ కసిరెడ్డిని పోలీసులు మంగళవారం సాయంత్రం వరకు విచారించారు.
వాస్తవానికి సోమవారం.. అర్థరాత్రి నుంచి విడతల వారీగా రాజ్ కసిరెడ్డిని విచారిస్తూనే ఉన్నారు.. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు కసిరెడ్డి వెల్లడించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వీటిలో ప్రధానంగా నాలుగు అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. వైసీపీ హయాంలో తీసుకువచ్చిన మద్యం విధానానికి రూపకర్త ఎవరు? అన్నది ప్రధాన ప్రశ్న. దీనికి కసిరెడ్డి ఎలాంటి తడబాటు లేకుండానే.. వైసీపీ ముఖ్య నాయకులు అని చెప్పినట్టు తెలిసింది.
ఈ ముఖ్య నాయకుల్లో వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి ఉన్నట్టు చెప్పారు. అదేవిధంగా సాయిరెడ్డి పాత్ర కూడా ముఖ్యమేనని.. ఆయన ఇప్పుడు తప్పించుకుంటున్నారని చెప్పినట్టు తెలిసింది. ఇక, డిస్టిలరీల వ్యవహారం అంతా.. సాయిరెడ్డే చూసినట్టు చెప్పారని తెలిసింది. కొన్ని కొన్ని విషయాల్లో మాత్రమే తన ప్రమేయం ఉందని.. తాడేపల్లి, హైదరాబాద్, బెంగళూరు లలో జరిగిన నాలుగు కీలక సమావేశాల్లోనే నిర్ణయాలు జరిగాయని వివరించినట్టు సమాచారం.
డిస్టరీల వ్యవహారం సహా.. మద్యం కేసుల విక్రయాలు.. లక్ష్యాలు పెట్టడం.. నిధుల విషయం అంతా.. కూడా.. తాడేపల్లికి చెందిన ముగ్గురు కీలక వ్యక్తులు చెబితేనే తాను చేసినట్టు కసిరెడ్డి వివరించినట్టు తెలిసింది. ఆ ముగ్గురులో అప్పటి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నట్టు చెప్పడం సంచలనంగా మారింది. ఎక్కడెక్కడ ఏయే మద్యం విక్రయించాలి. ఎవరిని వాడుకోవాలి.. అనే విషయాల్లో ఆయన ప్రమేయం ఉందని.. అదేవిధంగా అప్పటి ఓ మంత్రి ప్రమేయం కూడా ఉందని కసిరెడ్డి చెప్పినట్టు సమాచారం. ఇదిలావుంటే.. రాజ్ కసిరెడ్డి నుంచి మరిన్ని వివరాలు రాబట్టిన పోలీసులు కోర్టుకు ఆయనను హాజరుపరిచారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates