ఎట్టకేలకు ప్రతిష్ఠంభన వీడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఏడు నెలలకు పైగా విరామం తర్వాత ఆర్టీసీ బస్సులు తిరగబోతున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య అవగాహన కుదిరింది. కాకపోతే కొన్ని షరతుల మధ్య బస్సులు తిప్పబోతున్నాయి రెండు రాష్ట్రాల ఆర్టీసీలు. ఇంతకుముందు ఏపీ, తెలంగాణ ఆర్టీసీ బస్సులు కలిపి 4 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిప్పేవి.
ఇందులో మెజారిటీ బస్సులు ఏపీవే. దాదాపు రెండున్నర లక్షల కిలోమీటర్లు ఏపీ బస్సులే తిరిగేవి. తెలంగాణ వాటా లక్షన్నర కిలోమీటర్లకు కొంచెం ఎక్కువగా ఉండేది. ఐతే కరోనా-లాక్ డౌన్ వల్ల రెండు రాష్ట్రాల మధ్య మూణ్నాలుగు నెలలు బస్సులు తిప్పలేని పరిస్థితి నెలకొంది.
ఐతే ప్రజా రవాణాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చాక కూడా రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిరగలేదు. ఇందుకు రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనే కారణం. ఇంతకుముందున్నట్లు కాకుండా.. ఏపీ తమ రాష్ట్రానికి ఎన్ని బస్సులు తిప్పుతుందో, అవి ఎంత దూరం తిరుగుతాయో తామూ అలాగే చేస్తామని తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించారు. ఇందుకు ఏపీ అంగీకరించలేదు. దీనిపై నాలుగైదు దఫాలు చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. చివరికి ఇప్పుడు ఇద్దరూ సమాన దూరం బస్సులు నడిపేలా ఒప్పందం జరిగింది.
ఆశ్చర్యకరంగా ఏపీలో తెలంగాణ ఆర్టీసీ 826 బస్సులు తిప్పనుండగా.. తెలంగాణలో ఏపీఎస్ ఆర్టీసీ 638 బస్సులే తిప్పేట్లు అవగాహన కుదిరింది. ఈ ఒప్పందం ఏపీకి నష్టం చేకూర్చేదే. కానీ తెలంగాణ అధికారులు పట్టువీడకపోవడంతో దీనికి అంగీకరించక తప్పలేదు. ఐతే ఇంతకుముందు రెండు ఆర్టీసీలో నడిపే దూరంలో దాదాపు లక్ష కిలోమీటర్లు తగ్గిన నేపథ్యంలో అది ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు వరంలా మారనుంది. వాళ్లు మరిన్ని బస్సులు నడుపుతూ మరింత ఆదాయం పొందేందుకు అవకాశమిచ్చినట్లే.