విశాఖపట్నం గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పదవీచ్యుతులయ్యారు. కూటమి పార్టీలు.. రెండు మాసాల ముందు నుంచి చాలా వ్యూహాత్మకంగా ఇక్కడ చక్రం తిప్పి ఆమెనుపక్కన పెట్టాయి. కార్పొరేటర్లను ముందు నుంచి కూడా.. తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేశాయి. దీనిని తప్పుబట్టాల్సిన పనిలేదు. అధికారంలో ఉన్నవారు.. అంతే! గతంలో వైసీపీ కూడా ఇలానే చేసిందన్న ఆరోపణలు వున్నాయి. ఇక, అవిశ్వాస పరీక్షలో కూటమి విజయం దక్కించుకుంది. మేయర్‌ను ఓడించింది.
ఇక, ఇప్పుడు మిగిలింది.. డిప్యూటీ మేయర్. ఈ క్రతువు కూడా త్వరలోనే పూర్తికానుంది. అయితే.. ఇంత జరిగిన తర్వాత.. వైసీపీ అధినేత జగన్… తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. టీడీపీని.. చంద్రబాబును తిట్టిపోస్తూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ.. కన్నీరు పెట్టుకున్నారు. సుదీర్ఘ లేఖనుకూడా సంధించారు. అయితే.. వాస్తవం ఏంటంటే.. ప్రత్యర్థులు దూసుకు వస్తున్నట్టు జగన్‌కు తెలియదా? వైసీపీ హయాంలోని కార్పొరేషన్లను వశం చేసుకునేందుకు.. కూటమి ప్రయత్నిస్తోందని.. తమ కార్పొరేటర్లు కట్టుతప్పుతున్నారని ఆయనకు అవగతం కాలేదా? అంటే.. అయింది.
అయినప్పటికీ.. నైరాశ్యం చుట్టుముట్టి.. తన మాటను జవదాటరన్న ఏకైక అతి విశ్వాసం కారణంగా.. తాడేపల్లి గేటు దాటి బయటకు రాలేదు. ఆనాడే నిప్పు రాజుకున్నప్పుడే.. జగన్ స్పందించి ఉంటే.. ఈ సమస్య వచ్చేది కాదు. తనే స్వయంగా వెళ్లి విశాఖ లో కూర్చుని.. పరిస్థితిని అదుపులోకితెచ్చి ఉంటే వేరేగా ఉండేది. కానీ, జగన్ కనీసం ఒక్కసారి కూడా సమీక్షించలేదు. స్థానిక నాయకులతోనూ ఆయన మాట్లాడలేదు. తాను చెప్పాను కదా.. అన్నట్టు వదిలేశారు. క్షేత్రస్థాయి బలమైన కూటమి నాయకులు.. పనిచేస్తున్నారన్న విషయాన్ని గ్రహించలేకపోయారు.
మొత్తానికి చేతులు కాల్చుకుని నిప్పులపై ఆవేశ పడినట్టుగా.. ఆక్రోశించినట్టుగా జగన్.. తాను చేయాల్సిన పనిని వదిలేసి.. కట్టు తప్పాక.. చేతులు ఎత్తేశాక..ఇ ప్పుడు తప్పంతా చంద్రబాబుదేనని.. కూటమిదేనని చెప్పడం నవ్విపోదురుగాక.. అన్న సామెతనే గుర్తు చేస్తోంది. గతంలో ఏ చిన్న పొరపాటు దొర్లుతుందని తెలిసినా.. చంద్రబాబునేరుగా తమ్ముళ్లతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తానే నేరుగా శాసన మండలిలో కూర్చుని.. మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా తమ్ముళ్లు కదలేలా చేసుకున్నారు. కానీ.. జగన్ చేతులు కాలేవరకు వేచి చూసి.. ఇప్పుడు చంద్రబాబుపై ఏడుపులు పెడబొబ్బలు పెట్టడం ఎంత వరకు సమంజసమో ఆయనే ఆలోచించుకోవాలి.