సాయిరెడ్డి బాగోతం బ‌య‌ట పెడ‌తా: రాజ్ కసిరెడ్డి

ఏపీలో వెలుగు చూసిన మ‌ద్యం కుంభ‌కోణం వ్య‌వ‌హారంపై కూట‌మి ప్ర‌భుత్వం విచార‌ణ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ సాగిస్తోంది. ఈ కుంభ‌కోణంలో వేల కోట్ల రూపాయ‌లు దోచుకున్నార‌ని వైసీపీ నాయ కుల‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే కీల‌క నాయ‌కుల‌కు సిట్ నోటీసులు ఇచ్చి విచార‌ణ‌కు పిలుస్తోంది. ఇదిలావుంటే.. ఈ వ్య‌వ‌హారంలో క‌ర్త‌-క‌ర్మ‌-క్రియ అన్నీ క‌సిరెడ్డి రాజ‌శేఖ‌రేన‌ని(రాజ్ క‌సిరెడ్డి) మ‌రో కీల‌క నాయ‌కుడు వి. విజ‌య‌సాయి రెడ్డి చెబుతున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న రెండు మూడు సార్లు చెప్పారు. సిట్ విచార‌ణ‌లోనూ ఆయ‌న ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావి స్తున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా రాజ్ క‌సిరెడ్డి.. ఆడియో విడుద‌ల చేశారు. విజ‌య‌సాయిరెడ్డి మొత్తం బాగోతాన్ని తాను బ‌య‌ట పెడ‌తానని హెచ్చ‌రించారు. త్వ‌ర‌లోనే తాను బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని.. ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో త‌న న్యాయ‌వాదులు పిటిష‌న్లు దాఖ‌లు చేశార‌ని.. వాటిలో న్యాయ‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ త‌న‌కు ల‌భించాక‌.. బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని చెప్పారు. ఈ మేర‌కు తాజాగా ఓ ఆడియోను మీడియాకు విడుద‌ల చేశారు. అయితే.. ఆయ‌న ఎక్క‌డ ఉన్న‌దీ చెప్ప‌లేదు. ఎప్పుడు వ‌చ్చేదీ కూడా వివ‌రించ‌లేదు. కేవ‌లం న్యాయ‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ త‌న‌కు ల‌భించిన త‌ర్వాతే.. బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని అన్నారు. అప్పుడు సాయిరెడ్డి బాగోతం బ‌య‌ట పెడ‌తానన్నారు.

మ‌రోవైపు.. ఈ కేసులో ఇప్ప‌టికి మూడు సార్లు సిట్ అధికారులు క‌సిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. విచార‌ణ‌కు రావాల‌ని పిలిచారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న త‌ప్పించుకుని తిరుగుతున్నారు. హైద‌రాబాద్‌లోని ఆయ‌న నివాసంలోనూ సోదాలు చేప‌ట్టారు. అయినా.. క‌సిరెడ్డి ఆచూకీ మాత్రం ప‌సిగ‌ట్ట‌లేక పోయారు. ఇక‌, సాయిరెడ్డి విచార‌ణ‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. తాను ఈ మ‌ద్యం కుంభ‌కోణంలో పాత్రధారుడిని కాద‌న్నారు. అయితే, క‌సిరెడ్డికి, ఎంపీ మిథున్‌రెడ్డికి 100 కోట్ల రూపాయ‌ల చొప్పున అప్పు మాత్ర‌మే ఇప్పించాన‌ని.. అంతా క‌సిరెడ్డే ఈ కుంభ‌కోణంలో పాత్ర వ‌హించాడ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ ప‌రిణామాల క్ర‌మంలో క‌సిరెడ్డి ఆడియో విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.