ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌.. ప‌ట్టు బిగించిన టీడీపీ

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణకు ఏపీ గ‌వ‌ర్న‌ర్‌.. ఆమోద‌ముద్ర వేశారు. ఆ వెంట‌నే ప్ర‌భుత్వం కూడా.. గెజిట్ నోటిఫికేష‌న్ ఇచ్చేసింది. తాజాగా శుక్ర‌వారం జ‌రిగిన ఈ క్ర‌తువు ద్వారా.. ఇక నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టే ఉద్యోగ నియామ‌కాలు.. ప‌థ‌కాలు.. ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు దీనిని అమ‌లు చేయ‌నున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్ర‌కారం.. రాజీవ్ రంజ‌న్ మిశ్రా నేతృత్వంలో ఏక‌స‌భ్య క‌మిష‌న్ ఏర్పాటు చేసిన కూట‌మి ప్ర‌భుత్వం.. దీనిని బిల్లుగా మార్చి.. జాతీయ ఎస్సీ క‌మిష‌న్‌కు పంపించింది.

ఆవెంట‌నే జాతీయ ఎస్సీ క‌మిష‌న్ కూడా ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేయ‌గానే.. గ‌వ‌ర్న‌ర్‌కు పంప‌గా.. తాజాగా ఆయ‌న కూడా ఆమోదించారు. ప్ర‌స్తుతం ఇది చ‌ట్టంగా మారింది. అయితే.. ఇది కేవ‌లం ఉద్యోగాలు.. నియామకాలు వంటి విష‌యాల‌కే ప‌రిమితం కాలేదు. రాజ‌కీయంగా కూడా.. ఎంతో ప్రాధాన్యం సంత‌రించు కుంది. ఎస్సీల‌లో కీల‌క‌మైన మాదిగ సామాజిక వ‌ర్గానికి ఇదిమేలు చేయ‌నుంది. దీంతో సుమారు 5-6 జిల్లా ల్లో ఎక్కువ‌గా ఉన్న మాదిగ‌ సామాజిక వ‌ర్గం.. కూట‌మి పార్టీల‌వైపు నిలిచే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఒక‌ప్పుడు ఎస్సీల‌కు.. తామే కేరాఫ్ అని చెప్పుకొన్న వైసీపీకి తాజాగా అమ‌ల్లోకి వ‌చ్చిన వ‌ర్గీక‌ర‌ణ బిల్లు ద్వారా ఓటు బ్యాంకుకు గండి ప‌డ‌నుంది. ప్ర‌ధానంగా వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుకూలంగా ఉన్న మాదిగ‌ల‌కు.. జ‌గ‌న్ అండ‌గా నిల‌వ‌లేక‌పోయార‌ని… ఆది నుంచి కూడా చంద్ర‌బాబు మాత్ర‌మే త‌మ‌కు మ‌ద్ద‌తుగా నిలిచార‌ని.. మంద కృష్ణ‌మాదిగ గ‌తంలోనే చెప్పారు. సో.. దీనిని బ‌ట్టి.. మాదిగ సామాజిక వ‌ర్గం ఓట్లు.. గుండుగుత్త‌గా టీడీపీ లేదా కూట‌మి పార్టీల‌కు.. బ‌లంగా మార‌నున్నాయి.

ఇక‌, మాల‌ల విష‌యానికి వ‌స్తే.. ఈ వ‌ర్గీక‌ర‌ణ‌పై వారిలో కొంత అసంతృప్తి అయితే .. ఉంది. అలాగ‌ని పూర్తిగా వ్య‌తిరేకించేవారు కూడా లేరు. పైగా.. కొన్ని జిల్లాల‌కు మాత్ర‌మే వారు ప‌రిమిత‌మైనా.. వారి ఓటు బ్యాంకు వైసీపీకి అనుకూలంగా ఉంద‌ని భావించ‌లేం. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో మాల సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు.. ఓడిపోయారు. సో.. మాదిగ‌ల ఓటు బ్యాంకు ఉన్నంత‌ స్థిరంగా మాల‌ల ఓటు బ్యాంకు లేదు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎటు గాలి వీస్తే.. అటు వైపు నిల‌బ‌డతారు కాబ‌ట్టి.. దీనిపై ఆలోచించాల్సిన అవ‌స‌రం లేద‌ని కూట‌మి నాయ‌కులు చెబుతున్నారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ ద్వారా.. ఆయా వ‌ర్గాల్లో త‌మ ప‌ట్టు నిల‌బ‌డుతుంద‌ని అంటున్నారు.