బీజేపీ సీనియర్ నాయకుడు.. ఫైర్‌బ్రాండ్.. నాయకుడు ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దారెటు? మరి కొన్ని గంటల్లో జరగనున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన ఓటు ఎవరికి వేయనున్నారు? అసలు వేస్తారా? లేదా? ఏం చేస్తారు? ఇదీ.. ఇప్పుడు బీజేపీ నాయకులను కలవరపరుస్తున్న విషయాలు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికపై పార్టీ తెలంగాణ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన.. పార్టీ నాయకులు భేటీ అయ్యారు. ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో వివరించారు.
అయితే.. అత్యంత కీలకమైన ఈ సమావేశానికి హైదరాబాద్ పరిధిలో బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్ వస్తారని.. అందరూ అనుకున్నారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా.. ఆయన ఓటు కీలకంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార.. ప్రతిపక్ష బీఆర్ ఎస్ కార్పొరేటర్ల ఓట్లను కూడగట్టే ప్రయత్నం కూడా.. ఆయన చేస్తారని అనుకున్నారు. అలాంటిది కీలక సమావేశానికి రాజాసింగ్ డుమ్మా కొట్టారు. పోనీ.. సమాచారమైనా ఇచ్చారా? అంటే.. అది కూడా లేదు.
దీంతో రాజాసింగ్ తటస్థంగా ఉండిపోయే అవకాశం కూడా లేకపోలేదన్న చర్చ సాగుతోంది. వాస్తవానికి విప్ జారీ చేయాలని అనుకున్నా.. ఇది సాధ్యమయ్యేది కాదు. సో.. ఎవరి మానాన వారు పార్టీకి అనుకూలంగా ఓటేయాల్సి ఉంది. కానీ, రాజా విషయంలో మాత్రం అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కిషన్ రెడ్డితో ఆయనకు వ్యక్తిగతంగా ఉన్న సమస్యల కారణంగా.. ఇద్దరి మధ్య పొసగడం లేదు. పైగా.. పార్టీ రాష్ట్ర చీఫ్ ఎంపిక విషయంపైనా రాజాసింగ్ గరంగరంగానే ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన కిషన్ రెడ్డి నాయకత్వాన్ని బాహాటంగానే దుయ్యబడుతున్నారు. పైకి కిషన్‌రెడ్డి పేరు చెప్పకపోయినా.. అంతర్గత చర్చల్లో మాత్రం ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. పార్టీని నాశనం చేస్తున్నారని.. కొందరికి ఊడిగం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇలాంటి సమయంలో కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజాసింగ్ ఓటేస్తారా? వేయరా? అనేది సందేహంగా మారింది. ఒకవేళ ఆయన తటస్థంగా ఉండిపోతే.. పార్టీలో అంతర్గత కుమ్ములాట మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates