ఏపీలో కీలకమైన ఓ రాజ్యసభ సీటు ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీ నుంచి బయటకు వచ్చి.. తన రాజ్యసభ సీటుకు రాజీనామా చేసిన విజయ సాయిరెడ్డి సీటుకే ఇప్పుడు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. దీని ప్రకారం.. భర్తీ కానున్న ఈ సీటుకు ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లను తీసుకుంటారు.
అనంతరం.. ఈ నెల 30న నామినేషన్లను పరిశీలిస్తారు. మే 2వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక.. మే 9వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ప్రకియ మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే సాగనుంది. కాగా.. ఈ ఎన్నిక ద్వారా రాజ్యసభలో అడుగు పెట్టే అభ్యర్థి కేవలం 3 సంవత్సరాల వరకే.. పెద్దల సభలో అభ్యర్తిగా ఉండనున్నారు.
2022, జూన్‌లో వైసీపీ అధినేత జగన్.. మరోసారి సాయిరెడ్డికి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి ఆయన ఈ ఏడాది మొదటి వరకు కూడా.. రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగారు. అనంతరం.. వైసీపీకి రాజీనామా చేసి.. పెద్దల సభ నుంచి బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆరేళ్ల సభ్యత్వంలో ఇప్పటి వరకు.. అంటే.. ఆయన రాజీనామా చేసే నాటికి మిగిలిన సమయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
సో.. దీనిని ఎవరు చేపట్టినా.. మాగ్జిమం 3 ఏళ్ల వరకు మాత్రమే పెద్దల సభలో ఉండనున్నారు. తాజా పరిణామాలను బట్టి.. ఈ సీటును టీడీపీ సొంతం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఎమ్మెల్యే కోటా ఎన్నిక ద్వారా రాజ్యసభకు ఎంపిక చేసే ఎన్నిక కావడం గమనార్హం.