“విచారణకు రండి. ఈ నెల 18న హాజరై మాకు సహకరించండి. వచ్చేప్పుడు మీ వద్ద ఉన్న ఆధారాలు వివరాలు కూడా తీసుకురండి!” అని వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డికి వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు తాజాగా నోటీసులు పంపించారు. ఆయన ఈమెయిల్ సహావాట్సాప్‌లకు ఈ నోటీసులు పంపించారని అధికారులు తెలిపారు.
ఈ నెల 18న విజయవాడలోని ప్రత్యేక దర్యాప్తు బృందం కార్యాలయం(విజయవాడలోని పోలీసు కమిషనరేట్)లో హాజరు కావాలని సాయిరెడ్డికి తేల్చిచెప్పారు. కాగా.. ఈ కేసులో సాయిరెడ్డికి నోటీసులు జారీ చేయడం ఇదే తొలిసారి. గతంలో మరో కేసులో ఆయనను ఏపీ సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. ఇప్పుడు మద్యంకుంభకోణంలో విచారణకు హాజరు కావాలని తాఖీదులు ఇచ్చారు. ప్రస్తుతం బెంగళూరు లో సొంత మీడియా ఛానెల్ పనులపై బిజీగా ఉన్న సాయిరెడ్డి ఏమేరకు సిట్‌కు సహకరిస్తారో చూడాలి.
ఇదిలావుంటే.. వైసీపీ హయాంలో నకిలీ బ్రాండ్లు తయారు చేసి.. ప్రజలకు ఎక్కువ మొత్తాలకు లిక్కర్ విక్రయించి.. సొమ్ములు చేసుకున్నారన్న అభియోగాలు ఉన్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం దర్యాప్తు నకు ఆదేశించింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా ఈ కుంభకోణానికి కర్త-కర్మ-క్రియగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డిని వెంటాడుతోంది. ఇప్పటకే మూడు సార్లు విచారణకు పిలిచినా ఆయన తప్పించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, రాయదుర్గం వంటి చోట్ల ఉన్న ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించి.. విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సాయిరెడ్డికి కూడా.. నోటీసులు ఇచ్చా రు. ఈయనకు చెందిన బంధువుల ప్రమేయం లిక్కర్ కుంభకోణంలో ఉందని అధికారులు చెబుతున్నారు.