టీడీపీ పగ్గాల వ్యవహారం.. ఎప్పటికప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 1994-95 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2014 కు ముందు రాజకీయ అరంగేట్రం చేసిన నారా లోకేష్.. అప్పట్లో ఐటీడీపీని స్థాపించి.. సమర్థవంతంగా ముందుకు నడిపారు. పార్టీ విధివిధానాలు, చంద్రబాబు ఇమేజ్‌ను పెంచేలా.. ఆయన సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకుని పార్టీ అధికారంలోకి వచ్చేలా చేశారు.
తర్వాత.. ఎమ్మెల్సీ అయ్యారు. మంత్రి పదవిని పొందారు. 2019లో ఓడిపోయినా.. 2024లో పట్టుదలతో పార్టీ తరఫున మంగళగిరిలో విజయం దక్కించుకున్నారు. ఇక, 2022 నుంచి ఇప్పటి వరకు.. కూడా పార్టీలో నెంబర్ 2గా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు.. నారా లోకేష్ రాకను, ఆయన చక్రం తిప్పడాన్ని వ్యతిరేకించిన వారు.. సైతం.. తర్వాత ఆయనలో ఉన్న పట్టుదల, కృషిని చూసి ఫిదా అయ్యారు. తమ తదుపరి నాయకుడు నారా లోకేషేనని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే నారా లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించే విషయం తరచుగా చర్చకు వస్తోంది. గత ఏడాది మహానాడు జరిగినప్పుడు కూడా.. ఇదే విషయంపై బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. కానీ, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు ఇమేజ్ అవసరమని భావించిన సీనియర్లు.. అప్పట్లో ఈ వాదనకు దూరంగా ఉన్నారు. ఇక, ఇప్పుడు మరోసారి లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారా? అంటూ.. కొందరు సీనియర్ నాయకులే చర్చించుకుంటుండడం గమనార్హం.
ఈ నెల 20న చంద్రబాబు 75వ పడిలోకి ప్రవేశించనున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. కాదు.. వచ్చే నెలలో మహానాడు ఉంది.. అప్పుడు దీనిపై క్లారిటీ వస్తుందని.. అవసరమైతే.. అప్పుడే పగ్గాలు ఇచ్చినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి.. చంద్రబాబు మరింత యాక్టివ్ కావాల్సిన నేపథ్యంలో పార్టీ సమస్యలు, ఇతరత్రా భారాలను తగ్గించుకుంటారని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.