వైసీపీ హయాంలో ఏపీలో లిక్కర్ కుంభకోణం జరిగిందని.. దాదాపు 2 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ కీలక నాయకులు మింగేశారని ఆరోపించిన కూటమి ప్రభుత్వం.. దీనిపై విచారణకు విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు నేతృత్వం లో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అనేక మంది పేర్లను కూడా చేర్చింది. వీరిలో కసిరెడ్డి రాజశేఖరరెడ్డి ఉరఫ్ రాజ్.. పేరు ప్రముఖంగా ఉంది. అదేవిధంగా ఒక దశలో ఎంపీ మిథున్‌రెడ్డి పేరు కూడా ఉందన్న వార్తలు వచ్చాయి. దీంతో ఆయన సుప్రీకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పొందారు.
అయితే.. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికి మూడు సార్లకు పైగానే.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డిని పోలీసులు విచారణకు పిలిచారు. అయితే.. తనకు పని ఉందని ఒకసారి.. తనకు ఈ కేసులకు సంబంధం లేదని.. తాను పనిచేసిన శాఖ వేరని ఆయన తప్పించుకున్నారు. ఇక, మరోవైపు.. కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ వ్యవహారం ఇప్పటికీ తేలలేదు. ఇంతలో ప్రత్యక దర్యాప్తు బృందం తాజాగా హైదరాబాద్‌లో సోదాలు చేపట్టింది. కసిరెడ్డి నివాసం సహా.. ఆయన కార్యాలయంపైనా అధికారులు దాడులు చేశారు.
సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కసిరెడ్డి ఇంటికి చేరుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు.. ఇంటిని జల్లెడ పట్టారు. విలువైన పత్రాలు.. సహా.. కంప్యూటర్ హార్డు డిస్కులను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈ సోదాల సమయంలో ఇంట్లో వారిని బయటకు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయడంతోపాటు.. స్థానికంగా పోలీసుల సాయాన్ని కూడా తీసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న కసిరెడ్డి రాజ్ నివాసం చుట్టూ పోలీసులు భద్రత కల్పించారు. మరోవైపు.. దాడులు జరుగుతున్న సమయంలో కసిరెడ్డి ఇంట్లోలేరని సమాచారం. అయితే.. విషయాలను వెల్లడించేందుకు పోలీసులు అనుమతించలేదు.