ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా చేసిన ఓ పని.. నెటిజన్లనే కాదు.. చూసిన ప్రజలను కూడా ఫిదా అయ్యేలా చేసింది. నిత్యం ఎంతో బిజీగా ఉండే చంద్రబాబు.. ఏదైనా కార్యక్రమం కోసం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు.. అక్కడ ఆ పని ముగించుకుని నేరుగా తన నివాసానికో.. ఆఫీసుకో వచ్చేయడం సహజం. గతంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ కూడా ఇదే పనిచేశారు. ఇక, ఎవరైనా మధ్యలో అడ్డు పడి ఆపి.. తమ ఆవేదన చెబితే మాత్రమే పట్టించుకునే పరిస్థితి ఉంటుంది.
కానీ, దీనికి విరుద్ధంగా సీఎం చంద్రబాబు తాజాగా గుంటూరు జిల్లాలో చేసిన పని ఆయనలోని నాయకుడి ని మరోసారి నిరూపించింది. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం, పొన్నేకల్లులో చంద్రబాబు పర్యటించారు. అంబేడ్కర్ జయంతిని అక్కడే చేసుకున్నారు. అనంతరం తిరిగి వస్తుండగా.. పొన్నేకల్లు గ్రామం చివర్లో ఓ రేకుల చెడ్డు కింద బడ్డీ కొట్టు నిర్వహిస్తున్న మహిళ కనిపించారు. ఆమేమీ.. చంద్రబాబును చూసి బయటకురాలేదు. తనకు సాయం చేయాలని కూడా అడగలేదు.
కానీ, ఆమె నిర్వహిస్తున్న దుకాణం.. ఆమె ఉన్న తీరును గమనించిన చంద్రబాబు తనే స్వయంగా కాన్వాయ్ ను ఆపుకొని నేరుగా బడ్డీ కొట్టులోకి వెళ్లారు. ఆమె పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ బడ్డీ కొట్టు ద్వారా ప్రయోజనం లేదని ఆయనే చెబుతూ… దీనిని మరింత అభివృద్ధి చేయాలని ఆమెకు ఇల్లు, కుదిరి అర్హత ఉంటే పింఛను వంటివి కూడా సాయం చేయాలని కలెక్టర్‌ను స్వయంగా పిలిచి ఆదేశించారు.
నిజానికి అడిగితే కూడా.. సాయం అందించడం ప్రభుత్వాలకు ఇబ్బందిగా ఉన్న ఈ రోజుల్లో ఇటవల కాలంలో చంద్రబాబు ఇలా.. ఆకస్మిక పర్యటనలతో పేదలను ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం గమనార్హం. ఈ చర్యల పట్ట నెటిజన్లే కాదు.. వీడియో చూసిన వారు కూడా బాబుకు కృతజ్ఞతలు చెబుతున్నారు. నాయకుడి లక్షణం ఇదే నంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.