విజయనగరం మాజీ ఎంపీ పూసపాటి అశోక్ గజపతి రాజు వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారా? ఇదే సమయంలో సీనియర్ నాయకుడైనప్పటికీ.. యనమల రామకృష్ణుడుని పక్కన పెట్టారా? అంటే.. ఔననే అంటున్నారు సీనియర్ నాయకులు. ఇటీవల యనమల రామకృష్ణుడు 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ఉద్దే శించి.. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన ఓ పుస్తకాన్నికూడా లిఖించారు. దీనిపై పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.
కానీ, యనమల ఇంత చేసి.. ఎన్టీఆర్ కంటే కూడా.. చంద్రబాబు భేష్ అని కొనియాడినా.. ఆయన పాలన ను మెచ్చుకున్నా.. చంద్రబాబు కానీ.. పార్టీలో కీలక నాయకుడు మంత్రి నారా లోకేష్ కానీ.. ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. మరోవైపు.. యనమల కుమార్తె దివ్యపైనా.. ఫిర్యాదులు వస్తున్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ పరిణామాలో.. లేక, యనమల అవసరం లేదన్న వాదనతోనో.. చంద్రబాబు ఈ విషయంలో సైలెంట్ అయ్యారు.
మరోవైపు.. కేంద్రం నుంచి గవర్నర్ పదవి విషయంపై రేపో మాపో సంకేతాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడుకు గవర్నర్ పదవి అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న రవిని తప్పించి.. ఆయన స్థానంలో తమకు అనుకూలంగా ఉండే నాయకుడికి గవర్నర్ పగ్గాలు అప్పగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అశోక్ గజపతి రాజు వైపే చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై ఎలాంటి ప్రకటన రాలేదు.
కానీ,.. అంతర్గత చర్చల్లో మాత్రం పూసపాటికే.. చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. దీంతో యనమల వర్గం కుతకుత లాడుతోంది. అయితే.. ఇప్పటి వరకు టీడీపీలోనే ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు మార్పులు, చేర్పుల దిశగా అడుగులు వేస్తే.. అది మరింత నష్టమని.. దీని వల్ల వచ్చేది కూడా లేదని భావిస్తున్నారు. అయితే.. అధిష్టానం స్థాయిలో మాత్రం అశోక్‌వైపు మొగ్గు చూపడం చూస్తే.. సహజంగానే యనమల ఆవేదనలో ఉన్నారన్నది వాస్తవం. మరిఏంజరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates