కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బహుమతిగా రూ.4 కోట్లు ఇచ్చిన బీజేపీ

హర్యానా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ రెజ్లర్, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన వినేశ్ ఫోగాట్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కోట్లు నగదు బహుమతిగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఆమె 2023లో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో 50 కిలోల కేటగిరీలో చివరి అంచుల్లో డిస్‌క్వాలిఫై అయినా కూడా పోరాటం చూసి బీజేపీ ప్రభుత్వం ఇది పెద్ద గౌరవంగా భావించినట్టు తెలుస్తోంది.

ఈ నిర్ణయం వెనుక మరో ఆసక్తికర అంశం ఉంది. వినేశ్ ఫోగాట్ ప్రస్తుతం హర్యానాలోని జులానా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. అధికార బీజేపీ ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేకు ఇంత భారీ మొత్తంలో నగదు బహుమతి ప్రకటించడం రాజకీయంగా చాలా అరుదైన విషయం. అయితే బీజేపీ ప్రభుత్వం మాత్రం ఇది క్రీడా ప్రతిభకు ఇచ్చే గౌరవమేనని, దీనికి రాజకీయ కోణం లేనని చెబుతోంది.

వినేశ్‌కు ప్రభుత్వం మూడు ఆప్షన్లు ఇచ్చింది.. ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం లేదా నగదు బహుమతి. ఆమె నగదు బహుమతినే ఎంచుకోవడంతో ప్రభుత్వం రూ.4 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే ఇప్పుడు హర్యానాలో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే, సాధారణంగా బహుమతులు అధికార పార్టీకి చెందిన క్రీడాకారులకు ఎక్కువగా అందుతాయి అనే విమర్శలు మధ్య, ఇది విరుద్ధ దిశలో తీసుకున్న నిర్ణయం కావడంతో ప్రశంసలు, విమర్శలు రెండూ వస్తున్నాయి.

వినేశ్ ఫోగాట్ వ్యక్తిగతంగా ఇప్పటికే ఒక స్థిర ఆర్థిక స్థితిలో ఉన్నవారు. ఆమెకు ఖార్ఖోడాలో రూ.2 కోట్ల విలువైన ఇల్లు, రెండు విలాసవంతమైన కార్లు.. మెర్సిడెస్ జీఎల్ఈ, వోల్వో ఎక్స్‌సీ60 ఉన్నట్టు సమాచారం. అలాగే ఆమె ఆస్తుల విలువ సుమారు రూ.40 కోట్లు ఉంటుందని అంచనా. తన భర్త సోమ్‌వీర్ రాఠీ కూడా ఓ ప్రముఖ రెజ్లర్. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇచ్చే నగదు బహుమతితో ఆమె రాజకీయ, క్రీడా ప్రస్థానం మరోసారి హైలైట్ అవుతోంది. కానీ అదే సమయంలో ఇది ఓ రాజకీయ వ్యూహమా? లేక నిజంగా క్రీడాకారులకు ఇచ్చే గౌరవమేనా? అనే దానిపై చర్చ కొనసాగుతోంది.