మాధవ్ ఎక్కడ?.. వైసీపీ నేతపై కేసుల పరంపర

ఖాకీ చొక్కను వదిలి ఖద్దరు చొక్కా వేసుకున్న వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురువారం సాయంత్రం నుంచి కనిపించడం లేదట. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన బహిష్కృత ఐటీడీపీ యాక్టివిస్టు చేబ్రోలు కిరణ్ కుమార్ పై పోలీసుల సమక్షంలోనే దాడికి యత్నించిన కారణంగా.. గురువారం సాయంత్రం గుంటూరులో పోలీసులు గోరంట్ల మాధవ్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలుత గోరంట్లను తొలుత నగరం పాలెం పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు ఆ తర్వాత నల్లపాడు పీఎస్ కు తరలించారు. అదే సమయంలో కిరణ్ పై హత్యాయత్నం కేసుతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ గోరంట్లపై కేసులు నమోదు అయ్యాయి.

ఇలాంటి సమయంలో గోరంట్ల మాధవ్ ఎక్కడున్నారన్నది తెలియ రావడం లేదని వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అసలు గోరంట్లకు ఏమైందో కూడా తెలియడం లేదని, అసలు గోరంట్ల పోలీసుల అదుపులోనే ఉన్నారా? అని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే అదుపులోకి తీసుకున్న తర్వాత.. కేసు నమోదు చేశాక గోరంట్లను పోలీసులు ఏం చేస్తారు? ఎక్కడికి తరలిస్తారు? అయితే గియితే విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ లో ఉంచుతారు… లేదంటే కోర్టులో హాజరు పరుస్తారు. ఇవన్నీ జరిగేందుకు కొంత సమయం పడుతుంది కదా. అయితే ఈ కేసుల నమోదు అలా జరుగుతుండగానే… గోరంట్లపై మరో కేసును మంగళగిరి పోలీసులు నమోదు చేశారు. అంటే.. కేవలం 24 గంటల వ్యవదిలోనే మాజీ ఎంపీపై రెండు కేసులు నమోదు అయిపోయాయన్న మాట.

ఈ రెండో కేసు విషయానికి వస్తే.. పోలీసుల అదుపులోని కిరణ్ పై దాడి చేసేందుకు యత్నించడానికి ముందు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గోరంట్ల మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆడవాళ్లకు అక్క కాదు.. మగవాళ్లకు బావ కాదు అంటూ ఆయన లోకేశ్ పై అసభ్యకర వ్యాఖ్యలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదును ఆధారం చేసుకుని మంగళగిరి పోలీసులు గోరంట్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో శుక్రవారం సాయంత్రానికి గోరంట్లను పోలీసులు కోర్టులో హాజరు పరిచే అవకాశాలున్నట్లు సమాచారం.