“మాది బీసీ పక్షపాత పార్టీ. ఇంకా చెప్పాలంటే.. బీసీల పార్టీ” అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యా ఖ్యానించారు. బీసీలకు మేలు చేయడంలో తాము ఎప్పుడూ ముందే ఉన్నామని చెప్పారు. తాజాగా ఆయన ఉమ్మడి కృష్నాజిల్లా(ప్రస్తుతం ఏలూరు)లోని ఆగిరిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. మండల పరిధిలోని వడ్లమాను గ్రామానికి వెళ్లిన ఆయన.. అక్కడి ప్రజలతో మమేకమయ్యారు. పలువురు బీసీ సామాజిక వర్గాలకు చెందిన కుల వృత్తి, చేతివృత్తు దారులతో ఆయన మాట్లాడారు.
అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. తాము బీసీలకు అన్ని విధాలా మేలు చేస్తు న్నట్టు చెప్పారు. మంత్రి వర్గంలోనూ బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చామన్నారు. అనేక పథకాలు తీసుకువచ్చి బీసీల ఆత్మ గౌరవం పెంచామన్నారు. కార్పొరేషన్ల ఏర్పాట్లు పదవుల్లో భాగస్వామ్యం ద్వారా బీసీలు తమ కాళ్లపై తాము గౌరవంగా జీవించేలా ప్రయత్నం చేసినట్టు తెలిపారు. అప్పుడు ఇప్పుడు తమది బీసీల సానుకూల పార్టీ, ప్రభుత్వమేనని చెప్పారు.
బీసీలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారన్న ఉద్దేశంతోనే.. పార్టీ వ్యవస్థాపకుడు.. ఎన్టీఆర్ బీసీలకు కార్పొరేష న్లు పెట్టారని, తద్వారా నిధులు మంజూరు చేసివాటితో బీసీలు ఆర్థికంగా పుంజుకునేందుకు ప్రయత్నిం చారని తెలిపారు. అదేవిధంగా బీసీ విద్యార్థులు అన్ని రంగాల్లోనూ విజయం దక్కించుకునేందుకు వీలుగా బీసీ గురుకులాలు తీసుకువచ్చామన్నారు. అలానే.. విదేశాల్లో చదువుకునే వారికి రూ.15 లక్షల చొప్పున సాయం అందిస్తున్నట్టు తెలిపారు.
బీసీల్లోని చేతి వృత్తుల వారికి, కుల వృత్తుల వారికి.. ఆదరణ-3 పథకం కింద పెద్ద ఎత్తున పనిముట్లు అం దించిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. అయితే.. తాము అన్ని వర్గాలను సమానంగానే చేస్తున్నా మన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కూడా అనేక మేళ్లు చేస్తున్నామన్నారు. ఎస్సీలకు సౌరవిద్యుత్ ప్యానళ్లను ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు. ఇక పీ4 కార్యక్రమం కింద పేదలను ఉన్నత వర్గాలుగా తీర్చిదిద్దేం దుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.