వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ శుక్రవారం సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గతంలో వైసీపీ అధికారంలో ఉండగా… ఆయన ఇంటిపైకి దాడికి యత్నించారన్నది జోగిపై ఉన్న ప్రధాన ఆరోపణ. నాడు రణరంగాన్ని తలపించిన ఈ ఘటనలో జోగి రమేశ్ కీలక నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై నాడే కేసు నమోదు కాగా… నాడు విచారణ జరిగిన దాఖలానే కనిపించలేదు.
తాజాగా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే ఈ కేసును వెలికి తీసిన పోలీసులు… కేసును ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీకి అప్పగించారు. ఈ క్రమంలో ఇప్పటికే మూడు సార్లు జోగిని విచారించిన సీఐడీ అధికారులు… తాజాగా శుక్రవారం విచారణకు రావాలంటూ ఇటీవలే నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ప్రకారమే.. జోగి రమేశ్ విచారణకు హాజరయ్యారు. జోగితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 10 మందిని కూడా విచారణకు పిలిచిన సీఐడీ.. అందరినీ గంట పాటు విచారించించి వదిలేసింది.
సీఐడీ విచారణ అనంతరం జోగి రమేశ్ మీడియాతో మాట్లాడారు. నాడు తానేమీ చంద్రబాబు ఇంటికి మీదకు దాడికి యత్నించలేదని సీఐడీ అధికారులకు తెలిపానని ఆయన చెప్పారు. కేవలం చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలిపేందుకు మాత్రమే వెళ్లానని.. ఓ రాజకీయ నేతగా నిరసన తెలిపే హక్కు కూడా తనకు లేదా? అని ఆయన ప్రశ్నించారు. నిరసన తెలిపేందుకు వెళితే… చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించానని తనపై కేసు నమోదు కావడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదు కాబట్టే… ఈ కేసు విచారణ కోసం ఇప్పటికే సీఐడీ అధికారుల ముందు పలుమార్లు హాజరయ్యానన్నారు. శుక్రవారం కూడా సీఐడీ అధికారుల నోటీసుల మేరకే విచారణకు వచ్చానన్నారు. ఇంకెన్ని సార్లు సీఐడీ అధికారులు విచారణకు పిలిచినా కూడా హాజరవుతానని కూడా జోగి రమేశ్ తెలిపారు.
అనంతరం కూటమి పాలనపై జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకో రెండేళ్లు పోతే రెడ్ బుక్ ను మడిచి పెట్టుకోవాల్సిందేనని ఆయన మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ పాలనతో విపక్షాలను అణచివేయాలని చూస్తే కుదరదని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే కూటమి పాలనపై ప్రజల్లో స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. వైసీపీ పాలన కోసం, జగన్ మోహన్ రెడ్డి పాలన కోసం జనం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. కూటమి పాలన రాష్ట్రంలో ఇంకెంతో కాలం కొనసాగదని ఆయన అన్నారు. కూటమి పార్టీల నేతలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆయన సూచించారు. కూటమి అధికారంలోకి వచ్చినంతనే రాజకీయంగా సైలెంట్ అయిపోయిన జోగి రమేశ్… పోలీసుల విచారణకు వచ్చిన సందర్భంగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates