బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు కేసు నుంచి తప్పించారన్నది ఆయనపై ఉన్న అభియోగం. దీంతో తాజాగా శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన షకీల్‌ను విమానాశ్రయ అధికారులు.. నిర్బంధించారు. అనంతరం.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఏం జరిగింది?
2022-23 మధ్య హైదరాబాద్‌లోని ప్రజాభవన్ ముందు.. భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఇది అప్పట్లో తెల్లవారుజామున జరిగింది. అయితే.. ఈ ఘటనకు షకీల్ కుమారుడే కారణమని పోలీసులు గుర్తించి.. కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే.. అదేసమయంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. షకీల్ కుమారుడు సాహిల్..ఈ ఘటనకు బాధ్యుడైన ఆయన స్నేహితుడు.. ఆ వెంటనే విదేశాలకు వెళ్లిపోయారు.
ఈ నేపథ్యంలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న షకీల్‌ను పోలీసులు విచారించారు. కానీ, ఆయన కోర్టును ఆశ్రయించి రక్షణ పొందారు. కానీ, విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను కూడా తోసి పుచ్చిన షకీల్.. ఆయన కూడా.. విదేశాలకు వెళ్లిపోయారు. అయితే.. తాజాగా గురువారం షకీల్ మాతృమూర్తి కన్నుమూశారు. ఈ విషయం తెలియడంతో షకీల్ దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
అయితే.. అప్పటికే పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయ అధికారులు ఆయనను నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. కాగా.. తన మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరు కావాల్సి ఉందని షకీల్ పోలీసులకు చెప్పడంతో ఆ కార్యక్రమానికి వారు అనుమతించారు. అంత్య క్రియల అనంతరం.. పోలీసులు షకీల్‌ను అరెస్టు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.