బాబు ఆనందం అంతా ఇంతా కాదు… ఎందుకంటే…

ఏపీ ముఖ్య‌మంత్రిగా కూట‌మి ప్ర‌భుత్వాన్ని చ‌క్క‌టి స‌మ‌న్వ‌యంతో ముందుకు న‌డిపిస్తున్న చంద్ర‌బాబుకు 10 నెల‌లు పూర్తయ్యాయి. గ‌త ఏడాది జూన్ 10న ఆయ‌న అధికారం చేప‌ట్టారు. అయితే.. ఈ ప‌ది మాసాల కాలంలో ఏరోజూ జ‌ర‌గ‌న‌న్ని ప‌నులు.. సానుకూల కార్య‌క్ర‌మాలు.. ఈ రోజు(బుధ‌వారం-ఏప్రిల్-9) జ‌ర‌గ‌డంతో చంద్ర‌బాబు ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఒక‌ర‌కంగా చెప్పాలంటే..చంద్ర‌బాబు ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నార‌నే అంటున్నారు టీడీపీ నాయ‌కులు. “ఇది గుడ్ వెన్స్‌డే. మా నాయ‌కుడి ఆనందం అంతా ఇంతా కాదు“ అని విజ‌య‌వాడ‌కు చెందిన ఓ సీనియ‌ర్ టీడీపీనాయ‌కుడు వ్యాఖ్యానించారు.

ఏం జ‌రిగింది?

బుధ‌వారం ఉద‌య‌మే.. సీఎం చంద్ర‌బాబు త‌న సొంత ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కుటుంబంతో క‌లిసి ఆయ‌న‌.. అమరావ‌తి రాజ‌ధానిలోని స‌చివాల‌యం స‌మీపంలో  సొంత ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఇదొక ఆనందం. ఈ ఆనందాన్ని రెండింత‌లు చేస్తూ.. ఈ కార్య‌క్ర‌మం పూర్తీ అయ్యీ అవ‌డంతోనే కేంద్రం నుంచి భారీ గుడ్ న్యూస్ వ‌చ్చింది. సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలోని అప‌రిష్కృత స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రించేందుకు కేంద్ర హోంశాఖ కృషి చేస్తోంద‌న్న‌ది సారాంశం. హ‌మ్మ‌య్య అని చంద్ర‌బాబు అనుకున్నంత‌లో దీనిని మించిన మంచి వార్త ఆయ‌న చెవిలో ప‌డింది.

అదే.. అమ‌రావ‌తి గ్రీన్ కారిడార్‌. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి-హైద‌రాబాద్‌ల‌ను క‌లుపుతూ.. నిర్మించే అమ‌రావ‌తి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ కారిడార్ కు కేంద్రం ప‌చ్చ జెండా ఊపింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌రావ‌తి లెక్క‌వేరు.. ఇక నుంచి అమ‌రావ‌తి లెక్క‌వేరు అన్న‌ట్టుగా ప‌రిస్థితి మార‌నుంది. అంతేకాదు.. పెట్టుబ‌డులు కూడా పెర‌గ‌నున్నాయ‌న్న‌ది అధికారులమాట‌. దీంతో చంద్ర‌బాబు సంతోషానికి అవ‌ధులు లేకుండా పోయాయి. స‌రే.. ఈ ఆనందంలో చంద్ర‌బాబు మురిసిపోతుండ‌గానే.. మ‌రో గుడ్ న్యూస్ వ‌చ్చి చేరింది. ఇది కూడా సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న‌దే.

చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో `తిరుప‌తి-కాట్పాడి-కాణిపాకం` రైల్వేలైన్‌కు సంబంధించిన డ‌బ్లింగ్ ప‌నుల‌కు రైల్వే శాఖ ప‌చ్చ జెండా ఊప‌డ‌మే కాదు.. వెంట‌నే 1300 కోట్ల రూపాయ‌ల‌ను కూడా విడుద‌ల చేసింది. ఇంకేముంది.. చంద్ర‌బాబు ఆనందానికి ప‌ట్ట‌ప‌గ్గాలు లేకుండా పోయాయి. అయితే.. ఇంత కీల‌క ఆనంద స‌మ‌యంలో త‌న కూట‌మి మిత్రుడు , డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చెంత‌న లేక‌పోవ‌డంతో చంద్ర‌బాబు ఫీలైన‌ట్టు అమ‌రావతి వ‌ర్గాలు తెలిపాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉండి ఉంటే.. ఒకే రోజు జ‌రిగిన ఇన్నిప‌రిణామాల‌ను ఆయ‌న‌తో పంచుకుని పండ‌గ చేసుకునే వారని అంటున్నారు.