భారత రిజర్వ్ బ్యాంకు బుధవారం దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గత త్రైమాసిక సమీక్షలో భాగంగా 3 నెలల క్రితం వడ్డీ రేట్లను తగ్గించిన రిజర్వ్ బ్యాంకు తాజాగా బుధవారం నాటి త్రైమాసిక సమీక్షలోనూ వడ్డీ రేట్లను మరింతగా తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును గతంలో 0.25 శాతం తగ్గించిన సెంట్రల్ బ్యాంకు… ఈ సారి కూడా అదే వైఖరిని కొనసాగించింది. బుధవారం నాటి సమీక్షలో రెపో రేటును 0.25 శాతం మేర తగ్తించింది. ఫలితంగా రెపో రేటు తాజా తగ్గింపు తర్వాత 6 శాతానికి పరిమితమైంది.
రెపో రేటు తగ్గితే… సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గుతాయి కదా. ఇదివరకే ఓ మోస్తరు వడ్డీ రేట్లు తగ్గగా…తాజా నిర్ణయంతో ఆ వడ్డీ రేట్లు మరింతగా తగ్గనున్నాయి. ప్రత్యేకించి తాజా రెపో రేటు తగ్గింపు కారణంగా గృహ రుణాల వడ్డీ రేట్లు భారీగానే తగ్గే అవకాశాలున్నట్లు సమాచారం. ఆర్బీఐ తాజా నిర్ణయంతో గృహ రుణాల వడ్డీ రేట్లు 8 శాతం కంటే దిగివస్తాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అదే సమయంలో సాధారణ రుణాల వడ్దీ రేట్లలోనూ తగ్గుదల ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రెండు వరుస త్రైమాసికాల్లో రెండు పర్యాయాలు రెపో రేటును 0.25 మేర తగ్గించిన ఆర్బీఐ వడ్డీ రేట్లు దిగి రావడానికి దోహదం చేసిందని చెప్పాలి.
మొన్నటిదాకా రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా శక్తికాంత దాస్ కొనసాగితే… ఆయన గవర్నర్ గా ఉన్నంత కాలం రెపో రేటు దగ్గిన దాఖలానే కనిపించలేదు. దాస్ హయాంలో ఎప్పుడు ఆర్బీఐ త్రైమాసిక సమీక్ష జరిగినా… వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదన్న వార్తలే వినిపించాయి. అయితే 3 నెలల క్రితం దాస్ స్థానంలో రాజీవ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. వచ్చీ రావడంతోనే తన తొలి త్రైమాసికంలోనే రెపో రేటును 0.25 తగ్గించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన మల్హోత్రా…తన రెండో త్రైమాసిక సమీక్షలోనూ అదే జోరును కొనసాగించారు. వడ్డీ రేట్లను తగ్టించడం ద్వారా మరింత మేర రుణాలను విడుదల చేస్తూ బ్యాంకులు మరింత మేర ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంది. అదే సమయంలో జనానికి కూడా మరింత మేర రుణాలు అందుబాటులోకి వస్తాయి. వెరసి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది.