చంద్ర‌బాబు ‘డిజిట‌ల్’ పాల‌న షురూ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాష్ట్రంలో పాల‌న‌ను డిటిజ‌ల్ రూపంలోకి మారుస్తున్నారు. ఇప్ప‌టికే వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా.. చేసిన ప్ర‌యోగం స‌క్సెస్ అయింది. ఈ మాధ్య‌మం ఇప్పుడు అంద‌రికీ చేరువ అయిన విష‌యం తెలిసిందే. తెల్ల‌వారి లేచింది మొద‌లు రాత్రినిద్ర‌పోయే వ‌ర‌కు కూడా.. వాట్సాప్‌తోనే ప్ర‌జ‌ల జీవితాలు అనుసంధాన‌మై ఉంటున్నాయి. దీనిని ప‌సిగ‌ట్టిన చంద్ర‌బాబు.. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ను తీసుకువ‌చ్చారు. సుమారు 502 ర‌కాల కార్య‌క్ర‌మాల‌ను దీని ద్వారా అమ‌లు చేస్తున్నారు.

అంతేకాదు.. ప్ర‌తి నెలా దీనిపై రివ్యూ చేస్తున్నారు. ఫ‌లితాన్ని ప‌రిశీలించుకుని.. మార్పులు, చేర్పుల దిశ‌గా కూడా అడుగులు వేస్తున్నారు. ఈ ప‌రంప‌రలో తాజాగా.. కీల‌క‌మైన రిజిస్ట్రేష‌న్ వ్య‌వ‌స్థ‌ను కూడా.. డిజిట‌లీక‌ర‌ణ చేశారు. దీనికి బుధ‌వారం(ఈ రోజు) శ్రీకారం చుట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు స్తిరాస్తుల రిజిస్ట్రేష‌న్, వివాహాలు.. ఇత‌ర అంశాల రిజిస్ట్రేష‌న్ కోసం.. ఆయా జిల్లాల్లోని రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాల చుట్టూ తిర‌గాల్సి వ‌చ్చేది. అంతేకాదు.. మ‌ధ్య‌వ‌ర్తులు, బ్రోక‌ర్లు వంటి వారిప్ర‌మేయాన్ని ఎంత త‌గ్గించాల‌ని చూసిన త‌గ్గ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో రిజిస్ట్రేష‌న్ల వ్య‌వ‌స్థ‌ను డిజిటలీక‌రించే ప్ర‌క్రియ‌కు చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. బుధ‌వారం నుంచి 22 రిజిస్ట్రేష‌న్ల కార్యాల‌యాల్లో దీనిని ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభిస్తారు. అనంత‌రం.. వ‌చ్చే నెల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 144 కేంద్రాల్లో పూర్తిగా డిజిట‌ల్ విధానంలోనే రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌స్తారు. త‌ద్వారా.. ప్ర‌జ‌ల‌కు ద‌ళారుల నుంచి ఇబ్బందులు, అధికారుల నుంచి లంచాల బెడ‌ద వంటివి త‌ప్ప‌డంతోపాటు.. ప్ర‌క్రియ సులువు కానుంది.

ఏం చేస్తారు?

  • రిజిస్ట్రేష‌న్ల ప్రక్రియ‌ను డిజిట‌లీక‌ర‌ణ చేయ‌డం ద్వారా.. ఇంట్లో కూర్చునే సిస్టం ద్వారా.. స‌ద‌రు ప‌త్రాల‌ను నింపుకోవ‌చ్చు.
  • అదేవిధంగా రుసుములు, చార్జీల‌ను ఆన్‌లైన్‌లో చెల్లించ‌వ‌చ్చు.
  • అలానే రిజిస్ట్రేష‌న్ కోసం.. మ‌న‌కు న‌చ్చిన స‌మ‌యాన్ని ఎంచుకుని స్లాట్ బుక్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. ఆ స‌మ‌యానికి రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యానికి వెళ్లి రిజిస్ట్రేష‌న్ చేయించుకోవ‌చ్చు.
  • ఏదైనా అవ‌సరం అయిన ప‌క్షంలో రిజిస్ట్రేష‌న్ల సైట్‌లోనే హెల్ప్ అవ‌కాశం ఉంటుంది. దీనిని వినియోగించుకుని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకునే అవ‌కాశం ఉంటుంది.
  • ఏపీలో నేటినుంచి అమ‌ల్లోకి రానున్న ఈ ప్ర‌క్రియ దేశంలోనే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.