“జాగ్రత్తగా మాట్లాడండి… జాగ్రత్తగా ఉండండి”

అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, విపక్షంలోకి మారితే మరోలా మాట్లాడుతున్న వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై పోలీసు అదికారులు వరుసబెట్టి మరీ తప్పుబడుతున్నారు. గతంలో ఓసారి పోలీసుల బట్టలూడదీసి నడిరోడ్డుపై నిలబెడతామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై పోలీసు అదికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాప్తాడు పర్యటనలోనూ మంగళవారం జగన్ అవే వ్యాఖ్యలను చేశారు. ఈ వ్యాఖ్యలపై శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్నతో పాటు రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కూడా తమదైన రీతిలో స్పందించారు. సుతిమెత్తగానే స్పందించిన వీరు…జగన్ కు ఓ రేంజిలో బదులిచ్చినట్లుగా చెప్పాలి. జగన్ జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండాలంటూ సత్యసాయి జిల్లా పోలీసులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

జగన్ బట్టలూడిదీసేందుకు తాము వేసుకున్న యూనిఫామ్ ఎవరో ఇస్తే వేసుకున్నది కాదని జిల్లా ఎస్పీ రత్న చెప్పారు. తాము కష్టపడి మరీ యూనిఫామ్ ను సంపాదించుకున్నామని తెలిపారు. తాము తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అవసరం ఉందని తెలిపారు. జగన్ టూర్ లో తాము నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించామని ఆమె పేర్కొన్నారు. జగన్ భద్రత గురించి కూడా ఆమె తనదైన శైలిలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. జగన్ వీవీఐపీ కేటగిరిలో ఉన్నారని, ఉన్నతాధికారుల సూచన మేరకు ఇద్దరు ఎస్పీ స్థాయి అదికారులతో భద్రత కల్పించామని ఆమె తెలిపారు. హెలిప్యాడ్ వద్ద డీఎస్పీ స్థాయి అదికారిని నియమించామని, ప్రతి విషయాన్ని నిబంధనల మేరకు చేశామన్నారు. జగన్ రోడ్డు మార్గం ద్వారా బెంగళూరు వెళ్లినా భద్రత కల్పించామని ఆమె తెలిపారు.

ఇదిలా ఉంటే… రామగిరి ఎంపీపీ ఎన్నిక విషయంలో రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ పేరును ప్రస్తావిస్తూ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్వయంగా సుధాకర్ యాదవే స్పందించారు.తాము వేసుకున్న యూనీఫామ్ ఎవరో ఇస్తే తాము వేసుకోవడం లేదని ఆయన తెలిపారు. పరుగు పందెం, ఇతరత్రా పరీక్షల్లో పాల్గొని మరీ సత్తా చాటి యూనిఫామ్ ను సంపాదించుకున్నామని ఆయన తెలిపారు. అలాంటి యూనిఫామ్ ను ఊడదీస్తానంటే… ఊడదీయడానికి అదేమీ అరటి తొక్క కాదని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన జగన్ పేరును నేరుగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాము నిజాయతీగానే పనిచేస్తున్నామన్న సుధాకర్… అడ్డదారులు తొక్కమని తెలిపారు జగన్ జాగ్రత్తగా మాట్లాడాలని, జాగ్రత్తగా ఉండాలని కూడా ఆయన హెచ్చరించారు.