పోసాని సూళ్లూరుపేట వెళ్లక తప్పదా..?

ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి ఇంకా పూర్తిగా రిలీఫ్ అయితే దొరకలేదనే చెప్పాలి. వైసీపీ అధికారంలో ఉండగా… టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను దూషించిన కేసుల్లో ఇప్పటికే చాలా రోజుల పాటు జైలు జీవితం గడిపిన పోసానికి కోర్టు ఇటీవలే షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. నేతలపై దూషణల వ్యవహారంలో పోసానిపై ఏకంగా 18 కేసులు నమోదు కాగా… వాటిలో 17 కేసుల్లో బెయిల్ వచ్చింది. మిగిలిపోయిన ఒక్క కేసులో ఇప్పుడు ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసుల కారణంగా ఈ నెల 15న ఆయన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లక తప్పదని సమాచారం.

డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేశ్ లపై దూషణలు చేసిన పోసానిపై ఫిర్యాదు రాగా… సూళ్లూరుపేట పోలీసులు ఇటీవలే ఓ కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు రావాలంటూ ఆయనకు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15న సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ లో జరిగే విచారణకు హాజరు కావాలంటూ ఆయనను పోలీసులు ఈ నోటీసుల్లో ఆదేశించారు. పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. పోలీసుల ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందో ఇప్పటికే అర్థమైపోయిన పోసాని… ఈ నెల 15న సూళ్లూరుపేటకు తప్పకుండా వెళతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ సందర్భంగా పోసానిని పోలీసులు విచారించి వదిలేస్తారా? ఇతర పోలీసుల మాదిరే ఆయనను అరెస్టు చేస్తారా? అన్న దానిపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదు అయిన కేసుల్లో బెయిల్ తెచ్చుకున్న పోసాని… సీఐడీ కేసులో మాత్రం వారంతో రెండు రోజుల పాటు గుంటూరు సీఐడీ కార్యాలయంలో సంతకం చేయాలన్న కండీషన్ తో బెయిల్ తీసుకున్నారు. ఈ క్రమంలో వారంతో రెండు రోజులు ఆయన గుంటూరు సీఐడీ కార్యాలయానిక వెళుతున్నారు. ఈ సందర్భంగా సీఐడీ కార్యాలయానికి సంతకం చేయడానికి వచ్చిన సందర్భంగానే ఆయనకు సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు జారీ చేశారట. ఈ నోటీసులు చూసినంతనే పోసాని షాక్ కు గురైనట్టు సమాచారం. ఈ కేసుల్లో ఇప్పటికే చాలా రోజుల పాటు జైల్లో ఉన్నానని, తాజాగా బెయిల్ తీసుకుని వస్తే… మళ్లీ ఈ నోలీసుల గోల ఏమిటంటూ పోసాని తల పట్టుకున్నట్లు సమాచారం.