ఏపీలో 1400 దాటిన పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.ఒక్క కర్నూలు జిల్లాలోనే 43 కేసులు నమోదవడం కలవరపెడుతోంది. కర్నూలులో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 386కు చేరుకుంది. అయితే,కేసుల సంఖ్యలో కర్నూలుతో పోటీపడుతోన్న గుంటూరు జిల్లాలో కేవలం 4 కేసులే నమోదు కావడం ఊరటనిస్తోంది.

గత 24 గంటల్లో అనంతపురంలో 3, చిత్తూరులో 3, తూర్పుగోదావరిలో 2, గుంటూరులో 4, కడపలో 4, కృష్ణాలో 10, కర్నూలులో 43, నెల్లూరులో 2 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే, ర్యాపిడ్ కిట్ టెస్టులు కాకుండా ఆర్టీ పీసీఆర్ టెస్టులు కూడా ఎక్కువగా చేస్తున్నందుకే పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా. కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి అన్నారు.

దీంతో, ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య1403కు చేరింది. ఏపీలో కరోనా బారిన పడి ఇప్పటివరకు 321 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారని, ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1051 మంది చికిత్స పొందుతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తెలంగాణలో బుధవారం నాడు కొత్తగా 7 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,016కి చేరుకోగా..కరోనా బారిన పడి 25 మంది మరణించారు. బుధవారం నాడు 13 మంది చిన్నారుల సహా 35 మంది డిశ్చార్జ్ కాగా…మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 409కి పెరిగింది. గత నాలుగు రోజులుగా నమోదైన కేసుల గణాంకాలు (11, 2, 6, 7) తెలంగాణ ప్రజలకు ఊరటనిస్తున్నాయి.

ఇక, దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1,718 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 33,050కు చేరుకుంది. . గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి 67 మంది ప్రాణాలు కోల్పోగా…మొత్తం మరణించిన వారి సంఖ్య 1074కు చేరుకుంది.

ఇప్పటి వరకు కరోనా బారినపడి 8,324 మంది కోలుకోగా…ఆసుపత్రుల్లో 23,651 మంది చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మే 3 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.