తెలంగాణ శాసన మండలికి ఇటీవలే ఎన్నికైన పలువురు సభ్యులు సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ కార్యాలయంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్, బీజేపీ తరఫున ఎన్నికైన సభ్యులంతా ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. దీంతో శాసన సభ ప్రాంగణం ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రముఖ సినీ నటి, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి కూడా ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆమె వెంట టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు.
సినీ హీరోయిన్ గా ఒకింత ప్రాభవం తగ్గుతున్న సమయంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాలుపంచుకున్న విజయశాంతి బీఆర్ఎస్ లో చేరి రాజకీయంగానూ కీలకంగా వ్యవహరించారు. విజయశాంతి కోసం మెదక్ ఎంపీ సీటును ఆ పార్టీ అధినేత కేసీఆర్ వదిలేసిన వైనం నాడు ఆసక్తి రేకెత్తించింది. నాడు మెదక్ ఎంపీగా విజయం సాధించిన విజయశాంతి ఎందుకనో గానీ… బీఆర్ఎస్ లో ఎక్కువ కాలం పాటు కొనసాగలేకపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరినా అక్కడ కూడా ఆమె సెట్ కాలేకపోయారు. చివరగా టీడీపీని వదిలి కాంగ్రెస్ పగ్గాలు చేతబట్టిన ప్రస్తుత తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఆహ్వానంతో విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంచి వాగ్ధాటి, ఆయా అంశాలపై అవగాహన పుష్కలంగా కలిగిన విజయశాంతి అవకాశం చిక్కితే మాత్రం చెలరేగిపోతారని చెప్పొచ్చు.
ఇక మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయశాంతికి అవకాశం దక్కుతుందని ఏ ఒక్కరూ ఊహించలేదు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం జాబితా విడుదల చేసిన తర్వాత గానీ విజయశాంతికి అవకాశం దక్కిందన్న విషయం తెలియరాలేదు. ఈ లెక్కన అధిష్ఠానం వద్ద రాములమ్మకు మంచి పేరే ఉందని చెప్పక తప్పదు. అంతేకాకుండా ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీగా బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్ దృష్టిని కూడా విజయశాంతి ఆకర్షించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్ మద్దతు రాములమ్మకు ఎలాగూ ఉండనే ఉంది. ఓ వైపు అధిష్ఠానం, మరోవైపు సీఎం… ఈ రెండు వర్గాలకు మధ్య వారధిగా ఉన్న మీనాక్షి గుడ్ లుక్స్ లో ఉన్న రాములమ్మ భవిష్యత్తు ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వాస్తవానికి ఈ నెల 3ననే తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగాల్సి ఉంది. ప్రస్తుతం కేబినెట్ లో 6 మంది పదవులు ఖాళీగా ఉండగా… వాటిలో ఓ నాలుగింటిని మాత్రం భర్తీ చేసి… మిగిలిన రెండింటిని కొంత కాలం పాటు అలా ఖాళీగానే ఉంచాలని అధిష్ఠానం తీర్మానించిందని వార్తలు కూడా వచ్చాయి. ఇక మంత్రి పదవులు వీరికేనంటూ ఓ జాబితా కూడా సర్క్యులేట్ అయ్యింది. సీఎం రేవంత్ గవర్నర్ ను కూడా కలిశారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఖాయమేనన్న వాదనలకు బలం చేకూరింది. అయితే ఆ మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఆలోగానే ఎమ్మెల్సీగా విజయశాంతి ప్రమాణం చేసేశారు. ఈ లెక్కన రేపో, మాపో జరిగే మంత్రివర్గ విస్తరణలో రాములమ్మకు ఎంట్రీ లభించడం, కీలకమైన మంత్రిత్వ శాఖ పగ్గాలు దక్కడం ఖాయమన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. చూద్దాం.. మరి ఏం జరుగుతుందో?