టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దేశంలో అతి కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే దక్కుతున్న పటిస్ట భద్రతా వలయంలో కొనసాగుతున్నారు. దాదాపుగా దేశ ప్రధానికి అందుతున్న భద్రతా వలయానికి కాస్త అటూ ఇటూగా చంద్రబాబుకు భద్రత కొనసాగుతోంది. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పటిష్ట భద్రతలోనూ లోపాలు కనిపిస్తున్న తీరు నిజంగానే ఆందోళనకు గురి చేసేదే. ఈ భద్రతా వలయంలో ఉన్న నేతలు ఎక్కడికి వెళ్లినా.. ఆయా ప్రాంతాల్లో సదరు నేతలను కలిసే వారిని ముందుగానే గుర్తిస్తారు. ఎంపిక చేస్తారు. వారికి పాసులు అందజేస్తారు. ఆయా కార్యక్రమాల్లో పాలుపంచుకునే వారికి కూడా పాసులు అందజేస్తారు. అయితే ఎన్టీఆర్ జిల్లా నందిగామ పరిధిలోని చందర్లపాడు మండలం ముప్పాళ్లలో జరిగిన చంద్రబాబు పర్యటనలో ఏకంగా మూడు లోపాలు చోటుచేసుకున్నాయి.
సాధారణంగా చంద్రబాబు ఎంపిక చేసిన ప్రదేశానికి హెలికాఫ్టర్ ద్వారా చేరుకోగా… హెలిప్యాడ్ వద్దకు ఎంపిక చేసిన వారిని మాత్రమే అనుమతిస్తారు. అయితే ముప్పాళ్ల బాబు టూర్ లో హెలిప్యాడ్ పలువురు టీడీపీ నేతలతో పాటు ఓ వైసీపీ నేత కూడా కనిపించారు. హెలిప్యాడ్ వద్దకు వచ్చిన ఆ వైసీపీ నేత… టీడీపీ నేతలతో కలిసి వరుసలో నిలుచుని…బాబుకు పుష్పగుచ్ఛం అందించడంతో పాటుగా చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలికే వారి జాబితాలోనే లేని సదరు నేత హెలిప్యాడ్ దాకా ఎలా రాగలిగారన్నది ఇప్పుడు అంతుబట్టడం లేదు. ఆహ్వానితుల జాబితాలో లేని వ్యక్తి కేంద్ర బలగాల భద్రతను దాటుకుని మరీ చంద్రబాబు దగ్గరికి చేరుకోవడం, ఆపై చంద్రబాబుకు స్వాగతం పలకడం, అంతటితో ఆగకుండా చంద్రబాబుకు పాదాభివందనం చేశారంటే… ఇది భద్రతా అధికారుల నిర్లక్ష్యంగానే పరిగణించక తప్పదు.
ఇక వైసీపీకి చెందిన ముఖ్య నేత వద్ద పనిచేసే వ్యక్తి ఒకరు ముప్పాళ్ల టూర్ లో ఆద్యంతం చంద్రబాబును అనుసరించారట. హెలిప్యాడ్, గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్ద కూడా ఆ వ్యక్తి సంచరించినట్లుగా తెలుస్తోంది. సంచరించడం తోనే సరిపెట్టని సదరు వ్యక్తి ఏకంగా హెలిప్యాడ్ వద్ద, ప్రజా వేదిక వద్ద చంద్రబాబును వీడియోలు తీసి.. వాటిని ఆ తర్వాత సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారట. ఇక ప్రజా వేదిక ముందు ఎవరెవరు ఉండాలన్న విషయంపై ఒకింత జాగ్రత్తగానే వ్యవహరించిన అధికారులు… ప్రజా వేదిక వెనకాల కుర్చీలు వేసి ఉండగా.. వాటిలో ఆసీనులు అయిన వారు ఎవరన్న దానిని అస్సలు పట్టించుకోలేదట. ఈ వైఫల్యాలన్నీ టూర్ ముగిసిన తర్వాత వెలుగులోకి రాగా… భద్రతా అదికారులు తాపీగా వాటిపై ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. ఈ తరహా భద్రతా వైఫల్యాలు బాబు సెక్యూరిటీని ప్రశ్నార్థకం చేసేవేనని చెప్పక తప్పదు.